సున్నా డిగ్రీల చలిలో జవాన్ల సూర్య నమస్కారాలు

సున్నా డిగ్రీల చలిలో జవాన్ల సూర్య నమస్కారాలు

లడఖ్: అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. కరోనాపై పోరులో యోగ సాధన కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ఈ విషయాన్ని పక్కనబెడితే 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు నిరాడంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణ ప్రజానీకంతోపాటు రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు యోగా చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే జవాన్ల యోగా ఫొటోలు, వీడియోలు మాత్రం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)కు చెందిన ఓ ఆఫీసర్ లడఖ్‌లో 18 వేల అడుగుల ఎత్తుపై జీరో డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ సూర్య నమస్కారాలు చేసిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. 

ఐటీబీపీకి చెందిన పలువురు జవాన్లు 18 వేల అడుగుల ఎత్తుపై యోగా చేస్తున్న మరో వీడియో కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో ద్వారా యోగా ప్రాధాన్యత, విశిష్టత, అవసరాన్ని జవాన్లు చెప్పకనే చెప్పారని అనొచ్చు.