- ఆల్‌టైం హైకి ఐటీసీ, బజాజ్ ఆటో
- మార్కెట్ విలువలో ఇన్ఫిని దాటిన ఐటీసీ
వెలుగు బిజినెస్ డెస్క్: మంగళవారం ట్రేడింగ్ సెషన్లో షేర్లు ఆల్‌టైం హైకి చేరడంతో మార్కెట్ విలువలో ఇన్ఫోసిస్‌ను ఐటీసీ దాటేసింది. మార్కెట్ విలువపరంగా ఇప్పుడు ఆరో పెద్ద కంపెనీగా మారింది. కిందటి శుక్రవారం సెషన్లో హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువను ఐటీసీ అధిగమించింది. మంగళవారం సెషన్లో ఆల్‌టైం హై రూ. 413.45 ని తాకిన ఐటీసీ షేర్లు ఆ తర్వాత 0.5 శాతం లాభంతో రూ. 413.45 వద్ద క్లోజయ్యాయి. ఏడాది కాలంలో చూస్తే ఐటీసీ షేర్లు 61 శాతం రిటర్న్స్‌ను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టాయి.
ఇక మూడేళ్లకు చూస్తే 129 శాతం రిటర్న్స్‌ను అందించాయి. ఇంత భారీ ర్యాలీ వచ్చినా ఇప్పటికీ ఐటీసీ షేర్లు హెచ్‌యూఎల్‌తో పోలిస్తే డిస్కౌంట్‌కే ట్రేడవుతున్నాయి. ఐటీసీ షేర్లు ప్రైస్ టూ ఎర్నింగ్స్ మల్టిపుల్ 28 రెట్లయితే, హెచ్‌యూఎల్ ప్రైస్ టూ ఎర్నింగ్స్ 60 రెట్లుగా ఉంది. సమీప భవిష్యత్‌లో ఐటీసీ షేర్లు హెచ్‌యూఎల్ షేర్ల కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సిగరెట్ల బిజినెస్‌తో పాటు, ఇతర బిజినెస్‌లూ స్ట్రాంగ్‌గా కనిపిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మార్చి 2023 క్వార్టర్లో సిగరెట్వాల్యూమ్స్ రెండంకెల గ్రోత్ సాధించాయి. మరోవైపు రిలయన్స్ రిటెయిల్తోపాటు, ఇతర స్టార్టప్‌ల ఎంట్రీ వల్ల హెచ్‌యూఎల్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. కొన్ని సెగ్మెంట్స్‌లో హెచ్యూఎల్కి లీడర్షిప్ పొజిషన్ కొనసాగుతున్నప్పటికీ, ఎర్నింగ్స్ గ్రోత్ విషయంలో ఐటీసీ కంటే వెనకబడుతుందని ఎనలిస్టుల అంచనా.
బజాజ్ ఆటో లాభం తగ్గినా... అంచనాలకు మించింది
బజాజ్ ఆటో నికర లాభం మార్చి 2023 క్వార్టర్లో 2.5 శాతం తగ్గిపోయింది. మరో వైపు కంపెనీ అమ్మకాలూ కొంత తగ్గాయి. కానీ, ప్రకటించిన ఫలితాలు మాత్రం మార్కెట్అంచనాలకు మించాయి. దీంతో కంపెనీ షేర్లు మంగళవారం ఆల్ టైం హైని రికార్డు చేశాయి. మార్చి 2023 క్వార్టర్లో బజాజ్ ఆటో రూ. 1,433 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది క్యూ4 లో కంపెనీ నికర లాభం రూ. 1,469 కోట్లు. సెక్వెన్షియల్గా చూస్తే బజాజ్ ఆటో నికర లాభం దాదాపు 4 శాతం పడిపోయింది. బజాజ్ ఇబిటా మాత్రం తాజా క్యూ4 లో 26 శాతం ఎక్కువై రూ. 1,718 కోట్లకు చేరింది. మార్చి 2023 క్వార్టర్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మెరుగుపడింది. ఈ కంపెనీ ఇబిటా మార్జిన్స్ కిందటేడాది క్యూ4 తో పోలిస్తే 220 బేసిస్ పాయింట్లు అధికమైనట్లు. బజాజ్ ఆటో మార్చి 2023 క్వార్టర్లో రూ. 8,905 కోట్ల రెవెన్యూ సాధించింది.
ఇది అంతకు ముందు ఏడాది క్యూ4 లోని రూ. 7,975 కోట్ల కంటే 12 శాతం ఎక్కువ. డిసెంబర్ 2022 క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం రెవెన్యూ కూడా 4 శాతం తగ్గిపోయింది. ఏప్రిల్2022–మార్చి 2023 కాలంలో బజాజ్ ఆటో మొత్తం 39,27,857 యూనిట్లు అమ్మగలిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. టూ వీలర్ అమ్మకాలైతే 10 శాతం పడిపోయాయి. డొమెస్టిక్ సేల్స్ 17 శాతం పెరగ్గా, ఎగుమతులు ఏకంగా 27 శాతం తగ్గిపోయాయి. డైరెక్టర్ల బోర్డు 1400 శాతం అంటే షేర్ ఒక్కింటికీ రూ. 140 చొప్పున డివిడెండ్‌ను సిఫారసు చేసింది. ఈ కంపెనీ షేర్ల ఫేస్ వాల్యూ రూ. 10.
రిజల్ట్స్ ప్రకటనకి ముందే బజాజ్ ఆటో షేర్లు వరసగా అయిదో రోజూ పెరిగి ఆల్‌టైం హై రికార్డు చేశాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో బజాజ్ ఆటో షేర్లు దూసుకెళ్తున్నాయి. కిందటి అయిదు సెషన్లలోనూ ఆల్‌టైం హైని బజాజ్ ఆటో షేర్లు రికార్డు చేయడం విశేషం. బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు మంగళవారం కొద్దిగా లాభంతో రూ. 4,343.10 వద్ద ముగిశాయి. బజాజ్ ఆటో మార్కెట్ విలువ రూ. 1.23 లక్షల కోట్లు.