'పది' విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :  ఐటీడీఏ పీవో రాహుల్

'పది' విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :  ఐటీడీఏ పీవో రాహుల్

బూర్గంపహాడ్,వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై హెచ్ఎం, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉప్పుసాక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలు , తరగతి గదులు, అపరిశుభ్రంగా ఉండడం , సైన్స్ ల్యాబ్ నిర్వహణ తీరు సరిగా లేకపోవడంతో హెచ్ఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం పదవ తరగతి పిల్లలతో ప్రత్యేకంగా సమావేశమై పాఠశాలలో సౌకర్యాలు గురించి అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ అమలు పై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలని చెప్పారు.  పిల్లలు ఎవరికి ఎటువంటి సెలవులు ఇవ్వకూడదని, పరీక్షలు అయ్యేవరకు ఎవరు పాఠశాల విడిచి పోకుండా చూసే బాధ్యత సంబంధిత హెచ్ఎం చూసుకోవాలని అన్నారు. హెచ్ఎం, వార్డెన్, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భీమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.