కుమ్మక్కయ్యారు.. దోచేశారు .. ఇటిక్యాల మహిళా సమాఖ్య అవినీతి బాగోతం

కుమ్మక్కయ్యారు.. దోచేశారు .. ఇటిక్యాల మహిళా సమాఖ్య అవినీతి బాగోతం
  • సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి, రూ.20 లక్షలు స్వాహా 
  • లోన్ తీసుకున్న ప్రతీ లబ్ధిదారు నుంచి రూ.5 వేలు వసూలు చేశారన్న ఆరోపణలు

గద్వాల/ ఇటిక్యాల, వెలుగు: ఇటిక్యాల మహిళా సమాఖ్య పరిధిలో 2023–24  ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీఎం, సీసీలు, వీవోఏలు, బుక్​కీపర్లు కుమ్మక్కై, ఫోర్జరీ సంతకాలతో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి నిధులు) రూ.20 లక్షలు స్వాహా చేశారు. వరి ధాన్యం కొనుగోలులోనూ లోడుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేశారని, మహిళా సమాఖ్య నుంచి అప్పు తీసుకున్న ప్రతీ లబ్ధిదారు వద్ద రూ.5 వేలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. 

సంఘాల సభ్యులకు తెలియకుండానే..

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని సంఘాల సభ్యులకు అప్పు కావాలంటే గ్రామ సంఘంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంఘం ఆమోదంతో బ్యాంకు ద్వారా సదరు మహిళ అకౌంట్​లో నగదు జమ చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా జాయింట్​అకౌంట్​లో పడిన డబ్బులను నేరుగా వీవోఏలు డ్రా చేసుకున్నారు. ఇందుకోసం తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఆయా సంఘాల సభ్యులు అంటున్నారు. అదేవిధంగా ఒక సంఘం సభ్యురాలికి ఒక్కసారే రూ.50 వేల అప్పు ఇవ్వాలన్న రూల్​ఉంది. కానీ దాన్ని పట్టించుకోకుండా ఒకరికి ఒక్కటి కంటే ఎక్కువసార్లు అప్పు మంజూరు చేయించి, ఫోర్జరీ సంతకాల ద్వారా డ్రా చేసుకొని వాడుకున్నారని చెబుతున్నారు. ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి, కొండేరు, షాబాద్, చాగాపురం, కొండపేట, బీచ్ పల్లి, నక్కలపల్లి, సాతర్ల, వావిలాల, రావులచెరువు గ్రామాల్లో ఈ విధంగా దోపిడీ చేశారని పేర్కొంటున్నారు. సభ్యులకు తెలియకుండా చేసిన ఈ అవినీతిపై మండలంలో చర్చ 
జరుగుతోంది.   

అప్పు కట్టమని అడగడంతో వెలుగులోకి..

అప్పు తీసుకోకున్నా మీ పేరుపై అప్పు ఉందని, చెల్లించాలంటూ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులను అడగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జమ చేస్తున్న పొదుపు డబ్బులను పాత బకాయిల కింద పట్టుకోవడంతో సభ్యులు లబోదిబోమంటున్నారు. గతంలో పని చేసిన సిబ్బందితోపాటు ప్రస్తుత సిబ్బంది కూడా ఈ అవినీతిలో పాత్రధారులేనని మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

నాకు చెప్పకుండా తీసుకున్నరు

నాకు చెప్పకుండానే నా పేరిట రూ.1.50 లక్షల లోన్​ తీసుకున్నరు. ఇలా చాలామందిపై లోన్లు తీసుకొని, ఆఫీసర్లు తిన్నరు. డబ్బులు కట్టమని మా ఇంటికి వస్తే నేను ఎదురు ప్రశ్నించిన. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయిర్రు.

మద్దమ్మ, జింకల పల్లె, ఇటిక్యాల మండలం

ఎంక్వైరీ జరుగుతోంది

ఇటిక్యాల మహిళా సమాఖ్యలో  జరిగిన అవినీతిపై విచారణకు డీపీఎంను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఫైనల్ ​రిపోర్ట్ రాగానే బాధ్యులందరిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసులు, ఏపీడీ, గద్వాల