
- హైదరాబాద్ లో తొలిసారిగా పేపర్ వేసిన డ్రోన్
- ‘టైమ్స్ టెకీస్ ’ ఇనిషియేటివ్ లో భాగంగా చేసి చూపిన టైమ్స్
హైదరాబాద్: ట్రింగ్.. ట్రింగ్‌మంటూ పొద్దుపొద్దుగాల పేపర్‌బాయ్స్ సైకిళ్లపై ఉరుకులు పరుగులు పెడతరు. న్యూస్పేపర్లను సరిగ్గా పేర్చి సైకిలెనక క్యారేజ్‌పై పెట్టుకుని ఇంటింటికెళ్లి పేపరేస్తరు. మూడు, నాలుగంతస్తుల ఇళ్లంటరా పైకి ఇసిరేస్తరు. ఆ సౌకర్యం కూడా లేకపోతే పైకెక్కి డోర్ దగ్గర పడేస్తరు.
ఫర్ ఏ చేంజ్.. ఆకాశం నుంచి పేపర్ ఊడిపడితే ఎలాగుంటది? డ్రోన్ పేపర్‌బాయ్‌లా మారి గడప ముందు పేపర్ జారవిడిస్తే ఎట్లుంటది? వినడానికే మస్తుంది కదా! నిజంగా జరిగితే ఇంకెట్లుంటది?
హైదరాబాద్‌లో జరిగింది. మొదటి సారి ఒక డ్రోన్ ఇంటికి పేపర్ తెచ్చి ఇచ్చింది. ఇద్దరు దిగ్గజాల ఇంటికి న్యూస్ పేపర్‌ను చేర్చింది. ఆ దిగ్గజాలు ఎవరో తెలుసా? ఐటీ దిగ్గజం సైయెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రెడ్‌బస్ ఫౌండర్ సామ ఫణీంద్ర ఇళ్లకు డ్రోన్‌తో పేపర్ డెలివరీ చేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ చేపట్టిన ‘టైమ్స్ టెకీస్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇలా మొట్టమొదటిసారి పేపర్‌ను డ్రోన్‌తో డెలివరీ చేశారు. టెక్నాలజీని వాడుకుని పేపర్‌ను డెలివరీ చేసిన సంస్థను ఇద్దరు అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ప్రతి దాంట్లోనూ అనూహ్య ంగా దూసుకెళుతోంది. టెక్నాలజీల్లో వస్తున్న కొత్త పోకడలను తెలుసుకునేందుకు టైమ్స్ టెకీస్ ఉపయోగపడుతుంది” అని మోహన్ రెడ్డి అన్నారు. ‘‘టెకీస్కే కాకుండా సామాన్యులకీ ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఒక కార్యక్రమం వల్ల నాలెడ్జ్, నమ్మకం పెరిగితే సమాజంలో మార్పు వస్తుంది. అలాంటి కార్యక్రమమే టైమ్స్ టెకీస్. ఉపాధి పోతోందన్న చర్చ నడుస్తున్న టైంలో ప్రేరణనిచ్చేలా టైమ్స్ టెకీస్ రావడం మంచి పరిణామం” అని అన్నారు.
1849లోనే తొలి డ్రోన్
దీనినే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ అని అంటారు. అంటే మనిషి లేకుండా గాల్లో ప్రయాణించే వాహనాలు అని అర్థం. విమానాలు, హెలికాప్టర్లలాగే ఇవీ గాల్లో ఎగురుతాయి. కాకపోతే కొంచెం తక్కువ ఎత్తులో అవి పనిచేస్తాయి. గాల్లో ఎగిరే ఎత్తు, పనితీరు వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మొదట్లో కేవలం మిలటరీ అవసరాల కోసం మాత్రమే వాటిని తయారు చేశారు. ఇప్పుడిప్పుడే సామాన్యుడి అవసరాలు తీర్చేందుకూ వాటిని వాడుతున్నారు. వస్తువుల డెలివరీ, ఫుడ్డు డెలివరీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. మొన్నటికిమొన్న డ్రోన్ ద్వారా రక్తాన్ని రవాణా చేశారు. తద్వారా డ్రోన్లు మనిషి ప్రాణాన్ని కాపాడేందుకూ ఉపయోగపడుతున్నాయి. భూముల సర్వేకి, నిఘా కోసం, పై నుంచి ఫొటోలు తీసేందుకు.. ఏది కావాలన్నా డ్రోన్ల సహకారం తీసుకుంటున్నాం. నిజానికి డ్రోన్ అనే కాన్సెప్ట్ 1849లోనే ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ ఏడాది జులైలో దానిని ప్రయోగించారు. ‘బెలూన్ కారియర్లు’గా వాటిని పిలిచేవారు. వెనిస్ను ఆక్రమించుకునేందుకు ఆస్ట్రియా బలగాలు ఈ బెలూన్ కారియర్ల ద్వారానే బాంబులు జార విడిచే ప్రయత్నం చేశాయి. దాదాపు 200 బెలూన్లను పంపితే ఒక బాంబు మాత్రం సిటీలో పడింది. ఆ తర్వాత వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు బీజం పడింది మాత్రం 1900వ సంవత్సరంలో. మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా డేటన్–రైట్ ఎయిర్‌ప్లేన్ కంపెనీ పైలట్ లేని ఏరియల్ టార్పిడోను తయారు చేసింది. అప్పటి నుంచి డ్రోన్లను కేవలం యుద్ధం కోసం మాత్రమే తయారు చేశారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మనిషి లేకుండా అవి ఎట్ల ప్రయాణిస్తాయనే డౌట్ రావొచ్చు. అందుకోసమే వాటిలో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడతారు. సెన్సర్లు, రాడార్లను పెడతారు. డ్రోన్ గాల్లో ఎగిరేలా, ప్రయాణించేలా యాక్చువేటర్లుంటాయి. స్పీడ్‌ను నియంత్రించేందుకు డిజిటల్ ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్లుంటాయి. వాటిని ఇంజన్లు/మోటార్లు, ప్రొపెల్లర్లకు అనుసంధానిస్తారు.