
- అమూల్ వర్సెస్ నందిని
- అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేతలు
- నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించిన డీకే శివకుమార్
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ విమర్శ
బెంగళూరు: కర్నాటకలో అమూల్ వర్సెస్ నందిని బ్రాండ్ మధ్య రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ‘‘ఆన్లైన్లో అమూల్ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో మేం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం” అని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) చేసిన ట్వీట్ కర్నాటకలో రాజకీయ దుమారానికి దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అమూల్ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కర్నాటక రైతులందరూ కలిసి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)ను ఏర్పాటు చేసుకుని నందిని బ్రాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అమూల్ వస్తే కేఎంఎఫ్ పరిస్థితేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమూల్, కేఎంఎఫ్ విలీనంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ విమర్శిస్తున్నది.
రోడ్డెక్కిన కర్నాటక రక్షణ వేదిక
అమూల్ ప్రకటనను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్, జేడీ(ఎస్)తో పాటు కన్నడ అనుకూల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. బెంగళూరులో కర్నాటక రక్షణ వేదికతో పాటు పలు సంఘాల లీడర్లు రోడ్డెక్కడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సోమవారం కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ హసన్‌లోని నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి నందినికి మద్దతు ప్రకటించారు.
భారీగా తగ్గిన పాల ఉత్పత్తి
రాష్ట్రంలో పాల ఉత్పత్తి రోజుకు 90 లక్షల లీటర్ల నుంచి 75లక్షల లీటర్లకు పడిపోయింది. నందిని ప్రతిరోజూ ముంబైకి 2.5 లక్షల లీటర్లు, హైదరాబాద్‌కు 1.5 లక్షల లీటర్లు, ఏపీకి మరో బ్యాచ్ పాలను సప్లై చేస్తుంది. విదేశాలకు కూడా నందిని ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. మొత్తం అమ్మకాలలో 15 % కర్నాటక బయటే అవుతాయి.
అమూల్ రావడం లేదని బీజేపీ వెల్లడి
అమూల్ పాలు ఎవరూ కొనొద్దంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కేఎంఎఫ్, అమూల్ విలీనం అడ్డుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో నందిని ప్రోడక్ట్స్ కృత్రిమ సృష్టించారని జేడీ(ఎస్) విమర్శించింది. ప్రతిపక్షాల కామెంట్లను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. అమూల్ కర్నాటకలో ప్రవేశించడం లేదని, కేఎంఎఫ్‌తో విలీనమవ్వట్లేదని చెప్పారు.