రాష్ట్రపతి భవన్‌‌లో కనిపించింది పులి కాదు పిల్లి 

రాష్ట్రపతి భవన్‌‌లో కనిపించింది పులి కాదు పిల్లి 
  •  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఢిల్లీ పోలీసుల క్లారిటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం జరుగుతున్న వేళ స్టేజీ వెనక ఓ జంతువు ప్రత్యక్షమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. వీడియోలో ఉన్నది పులి అంటూ జరిగిన ప్రచారమంతా అవాస్తవమని తేల్చి చెప్పారు. అది సాధారణమైన పిల్లి అని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి రూమర్లను నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రపతి భవన్‌‌లో కుక్క లు, పిల్లులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..!

రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం ప్రధాని, కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్న ఈ  వేడుకలో ప్రమాణ స్వీకార స్టేజ్​ వెనక ఓ జంతువు కనిపించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి గెలుపొందిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో ఆ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తొలుత ఫేక్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అని అంతా కొట్టిపారేశారు. కానీ, ప్రధానమంత్రి కార్యాలయం షేర్  చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్​ను పరిశీలించినప్పుడు.. స్టేజీకి దగ్గరగా ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది. నడకను బట్టి అది పులి అని కొందరు.. పిల్లి అయ్యుంటుందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చన్న ఊహాగానాలూ వెలువడటంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు.