తుదిశ్వాస విడిచిన ఇవానా ట్రంప్

తుదిశ్వాస విడిచిన ఇవానా ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య  ఇవానా ట్రంప్ (73)  కన్నుమూశారు.  ఈవిషయాన్ని  ట్రంప్ గురువారం ప్రకటించారు. న్యూయార్క్ నగరంలోని స్వగృహంలో ఇవానా  తుదిశ్వాస విడిచారని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా  వెల్లడించారు.   అయితే మరణానికి గల కారణాలను తెలుపలేదు.

‘ఇవానా అద్భుతమైన మహిళ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.  ముగ్గురు పిల్లలే (డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్)  లోకంగా జీవించింది. వాళ్లను చూసి మురిసిపోతుండేది. మేము కూడా ఇవానా స్ఫూర్తిదాయక జీవితాన్ని తలుచుకొని గర్విస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. 


ఇవానా నేపథ్యం ఇదీ.. 

ఇవానా ట్రంప్ చెక్ రిపబ్లిక్ దేశంలోని జ్లిన్ నగరంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. ఆమె ఒక ఫ్యాషన్ మోడల్.  అప్పుడప్పుడే  అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొగ్గ తొడుగుతున్న డొనాల్డ్ ట్రంప్ ను.. 1977 సంవత్సరంలో  ఆమె పెళ్లి చేసుకున్నారు.  డొనాల్డ్, ఇవానా దంపతుల తొలి సంతానం డొనాల్డ్ జూనియర్.  తర్వాతి సంతానం ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్. 1980వ దశకంలో డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. ఆ సమయంలో భర్త డొనాల్డ్ కు తోడుగా వ్యాపారంలో ఇవానా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1990వ దశకంలో  డొనాల్డ్ ట్రంప్ కు ప్రఖ్యాత బాలీవుడ్ నటి మార్లా మేపుల్స్ తో అఫైర్ ఉందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో డొనాల్డ్, ఇవానా మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.  ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మీడియా గాసిప్స్ ను నిజం చేస్తూ  హీరోయిన్ మార్లా మేపుల్స్ ను డొనాల్డ్ ట్రంప్ పెళ్లాడారు.  అనంతరం ఇవానా ట్రంప్  ఆభరణాలు, బ్యూటీ ప్రోడక్ట్స్, వస్త్రాలంకరణ రంగాల్లోని తన వ్యాపారాలపై దృష్టిపెట్టారు.  కాగా, డొనాల్డ్ ట్రంప్, మార్లా మేపుల్స్ వైవాహిక జీవితం కూడా 1999 సంవత్సరంలో ముగిసింది.  ఆరేళ్ల తర్వాత (2005 సంవత్సరంలో) డొనాల్డ్ ట్రంప్ , మెలానియాను  మూడో పెళ్లి చేసుకున్నారు.