ఈడీ విచారణకు ఎందుకు హాజరు కావాలి ? : సోరెన్

ఈడీ విచారణకు ఎందుకు హాజరు కావాలి ? : సోరెన్

నేరం చేసి ఉంటే తనను అరెస్టు చేయాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోసోరెన్ అన్నారు. విచారణకు ఎందుకు హాజరు కావాలని ప్రశ్నించారు. ఈడీ కార్యాలయం దగ్గర భద్రతను పెంచడంపై ..జార్ఖండీలంటే ఎందుకంత భయం? అని నిలదీశారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి రాంచీలోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది. దీనిపై స్పందించిన సోరెన్ .. రాష్ట్రంలో జార్ఖండీల పాలనే ఉంటుంది కానీ.. బయటి వ్యక్తులకు ఆ అర్హత లేదన్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని విమర్శించారు. హక్కుల కోసం జార్ఖండీలు కదం తొక్కే రోజులు తొందరలోనే ఉన్నాయని.. ప్రతిపక్షాలకు అవకాశం కూడా ఉండదన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జులై నెలలో ఈడీ జార్ఖండ్ వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా మిశ్రా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.11.88కోట్లు, ఇంట్లో 5.34కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోరెన్ నియోజకవర్గమైన బర్హైత్ లో మైనింగ్ వ్యాపారాన్ని మిశ్రా నియంత్రిస్తున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మైనింగ్ లీజుల వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కొన్ని నెలల క్రితమే ఫిర్యాదు కూడా చేసింది.