లండన్: ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ట్యూనీషియా ప్లేయర్ ఆన్స్ జబెర్.. వింబుల్డన్‌లో సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో మూడోసీడ్ జబెర్ 6–2, 3–6, 6–1తో టిట్జియానా మరియా (జర్మనీ)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ విమెన్ ప్లేయర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో సౌతాఫ్రికాకు చెందిన ఐరినా బౌడెర్ పికాక్ (1927 ఫ్రెంచ్), రినీ షుర్మన్ (1959 ఆస్ట్రేలియా ఓపెన్) సింగిల్స్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. గంటా 43 నిమిషాల పోరాటంలో జబెర్ తన సర్వీస్ పవర్‌ను చూపెట్టింది.
ఫలితంగా తొలిసెట్‌లో మూడు, ఏడో గేమ్‌లో మరియా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ సెట్‌లో జబెర్ 15 విన్నర్స్ కొడితే, మరియా ఆరింటితోనే సరిపెట్టుకుంది. ఒక్క బ్రేక్ పాయింట్ చాన్స్ కూడా రాలేదు. రెండో గేమ్‌లో జబెర్ 17 తప్పిదాలు చేయడంతో 3–1 లీడ్‌లో నిలిచిన మరియా వెనుదిరిగి చూసుకోలేదు. హోరాహోరీ తప్పదనుకున్న డిసైడర్ ఏకపక్షంగా మారిపోయింది. వరుస గేమ్స్‌తో హోరెత్తించిన జబెర్ 5–0 లీడ్‌లో నిలిచి సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో 17వ సీడ్ రిబకినా (కజకిస్తాన్) 6–3, 6–3తో 16వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)కు షాకిచ్చింది. గంటా 15 నిమిషాల మ్యాచ్‌లో హలెప్ సర్వీస్ రిటర్న్స్‌లో వెనుకబడింది. శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో జబెర్.. రిబకినాతో తలపడుతుంది.
సానియా.. సెమీస్‌తోనే సరి
భారీ ఆశలు రేకెత్తించిన ఇండియా స్టార్ ప్లేయర్ సానియా మీర్జా–మ్యాట్ పవిచ్ (క్రొయేషియా) మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌తోనే సరిపెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్‌లో సానియా–పవిచ్ 6–4, 5–7, 4–6తో స్కుప్‌స్కి (బ్రిటన్)–క్రావ్‌జిక్ (అమెరికా) చేతిలో ఓడారు. 2 గంటలా 16 నిమిషాల పాటు జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సానియా ద్వయం.. మూడో సెట్‌లో నిరాశపర్చింది. ఇప్పటికే ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 35 ఏళ్ల సానియా.. మిక్స్‌డ్‌లో ‘కెరీర్ స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ ఆమె ఆశలు నెరవేరలేదు. మిక్స్‌డ్ కేటగిరీలో సానియా.. 2009లో ఆస్ట్రేలియా, 2012 ఫ్రెంచ్ (మహేశ్ భూపతితో కలిసి), 2014 యూఎస్ ఓపెన్ (బ్రూనో సోరెస్)ను గెలుచుకుంది.
