పీఆర్సీ, పెండింగ్ బకాయిల కోసం.. పోరుబాట

V6 Velugu Posted on Nov 28, 2021

అమరావతి: పీఆర్సీ, పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని పదేపదే చెబుతూ వస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ పోరుబాట షెడ్యూల్ ను ఖరారు చేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదని భావిస్తూ ఆందోళన చేయక తప్పడంలేదని ప్రకటించాయి. పీఆర్‌సీ, పెండింగ్‌ బకాయిలు, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ విజయవాడలో విడిగా భేటీ అయిన ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ ఎన్జీవో జేఏసీలు తమ డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమిస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉద్యోగ సంఘాలు నోటీసు ఇవ్వనున్నాయి. 
చేపట్టాల్సిన ఆందోళనలపై పరస్పరం చర్చించిన అనంతరం సంయుక్త కార్యాచరణను ప్రకటించాయి. ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చేందుకు ముందుగా వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేసిన తరవాత పెన్‌డౌన్‌ చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్‌ 1వ తేదీన నోటీసు ఇచ్చిన అనంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా పోరుబాట షెడ్యూల్ ఖరారు చేశారు. 
ఉద్యోగులు, పెన్షనర్ల పోరుబాట షెడ్యూల్ ఇదే
డిసెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు.
డిసెంబర్‌ 16న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2వరకు ధర్నా.
డిసెంబర్‌ 21వ తేదీ నుంచి 26 వరకు జిల్లా కేంద్రాల్లో ధర్నా.
డిసెంబర్‌ 27న విశాఖపట్టణంలో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు.
డిసెంబర్‌ 30వ తేదీన తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
జనవరి 3న ఏలూరులో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
 జనవరి 6న ఒంగోలులో సాయంత్రం 4 గంటలకు  ప్రాంతీయ సదస్సు.

Tagged AP, Schedule, latest, Andhra Pradesh, Employees, Fight, PRC, details, protests, Concerns, JAC, unions, pensioners, Arrears, decission

Latest Videos

Subscribe Now

More News