
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: డిసెంబర్లో రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైరయ్యారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఆయన.. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం గురించి మాట్లాడే ముందు అసలు బీజేపీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని మహేశ్వర్ రెడ్డికి సూచించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారని, రాబోయే పదేండ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. వంశీ రామ్ మ్యాన్ హట్టన్ భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని, దీనిపై నలుగురం ఎమ్మెల్యేలం పిల్ వేశామని చెప్పారు. జడ్జి మారడంతో ఈ కేసు బెంచ్ మీదకు రాలేదన్నారు.