
- స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీలోకి భారీగా వలసలు
- గ్రామాల్లో ‘కారు’ దిగుతున్న లీడర్లు
- అధికార పార్టీలో చేరికలపై సొంత పార్టీలో అసంతృప్తి
మహబూబ్‌నగర్, వెలుగు: ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో.. ప్రభుత్వ కార్యక్రమాలు, లబ్ధిదారులకు స్కీములు వర్తింపజేయడం స్పీడ్‌గా జరుగుతోంది. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో తిరుగుతూ కేడర్‌ను ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.
పల్లె నుంచి నగరం వరకు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ సంఖ్యలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్లు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఓటర్లను ప్రభావితం చేయగల లీడర్లు ఉన్నారు. పది రోజుల కింద జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత బీఆర్ఎస్ను వీడారు. స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఈమెతో పాటు ఇదే పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్, బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్ ఉన్నారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మాజీ కౌన్సిలర్లు గోపాల్‌యాదవ్, రామకృష్ణ ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో హస్తం గూటిలో చేరారు. కార్పొరేషన్ పరిధిలోని మరో 500 మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరారు. గతంలో ఈయన వెంకటాపూర్ గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పని చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కేడర్.. పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
బీజేపీలోనూ చేరికల పర్వం..
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా ఎంపీ డీకే అరుణ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ‘గడప గడపకు బీజేపీ’ పేరుతో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి నగరం వరకు చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచంద్రావు పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల కింద మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని న్యూ గంజ్ ప్రాంతానికి చెందిన దాదాపు 90 మంది ఎంపీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి!
కాంగ్రెస్‌లోకి పెద్ద మొత్తంలో చేరికలు జరుగుతుండడంతో ఆ పార్టీ లీడర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చేరికలు ఎందుకనే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పార్టీలు మారుతున్న లీడర్లు మాత్రం అధికార పార్టీలోకి వస్తే తమకు ప్రయోజనం ఉంటుందని, వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ లీడర్లు మాత్రం తమ స్వలాభం కోసం, దందాలను కాపాడుకోవడానికి వస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.అయితే హైకమాండ్ పార్టీలు మారిన వారికి టికెట్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికే ప్రియారిటీ ఇస్తుందని సీనియర్ లీడర్లు చెబుతున్నట్లు తెలిసింది.
చేతులెత్తేసిన మాజీలు..
మహబూబ్‌నగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్ కుచెందిన గ్రామ, మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయి లీడర్లు ‘కారు’ దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొందరు లీడర్లు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు అధికారం పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయినా.. ఆ పార్టీకి చెందిన లీడర్లు స్పందించలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ పార్టీ నుంచి లీడర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక ఎన్నికల నాటికి కేడర్‌ను చేజార్చుకోకుండా కాపాడుకోవాల్సి ఉన్నా చేతులెత్తేస్తున్నారు.