డెఫ్ ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయికి కాంస్యం

డెఫ్ ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయికి కాంస్యం

అంగవైకల్యం ఆమె ఆటముందు చిన్నబోయింది. ఆమె ప్రతిభకు ఒలింపిక్ మెడల్..మెడలో హారంగా మారింది. చిన్నప్పటి నుంచి ఆటే  శ్వాసగా, ఆటే ధ్యాసగా  అనేక టోర్నీల్లో గెలిచిన టెన్నీస్ ప్లేయర్ షేక్ జాఫ్రీన్..డెఫిలింపిక్స్లో బ్రౌంజ్ మెడల్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. తెలుగువారందరూ గర్వపడేలా చేసింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. 

బ్రెజిల్‌ వేదికగా మే 1 నుంచి 15 వరకు డెఫిలింపిక్స్‌ 2021 పోటీలు జరిగాయి. ఇందులో 72 దేశాలకు చెందిన 2100 మంది క్రీడాకారులు  పాల్గొన్నారు. మన దేశం నుంచి 65 మంది క్రీడాకారులు 11 రకాల క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు. ఇక టెన్సీస్ మిక్సడ్ డబుల్స్లో షేక్ జాఫ్రీన్ జోడి.. భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటపై 6-1,6-2 స్కోరు తేడాతో విజయం సాధించింది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 

తండ్రి కోరికతో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి....
షేక్ జాఫ్రీన్ 1997 సెప్టెంబర్ 7న కర్నూలులో జన్మించింది. ఆమె పుట్టుకతోనే  బధిరురాలు. అయితే జాఫ్రిన్‌ మూడేళ్ల వయసులో ఆమెకు మూగ, చెవుడు అని తల్లిదండ్రులు గుర్తించారు. అయినా నిరాశ పడలేదు. తల్లిదండ్రులు ఆమె ప్రతిభకు తోడయ్యారు. జాఫ్రీన్ తండ్రి జాకీర్‌ అడ్వకేట్‌. జాఫ్రిన్‌కు  చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉండేది. ముఖ్యంగా టెన్నిస్‌ అంటే జాఫ్రీన్కు ఇష్టం. దీన్ని గమనించిన తల్లిదండ్రులు..ఆమెకు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇప్పించారు. 8 ఏళ్ళ వయసులో జాఫ్రీన్ తొలిసారిగా టెన్నిస్ రాకెట్‌ పట్టుకుంది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తండ్రి.. జాఫ్రీన్ను అంతర్జాతీయ టెన్నీస్ ప్లేయర్గా చూడాలనుకున్నాడు.  ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌లో జాఫ్రీన్ పేరును రిజిస్టర్‌ చేయించారు. ఆ తర్వాత అండర్ 12,14 విభాగాల్లో జాఫ్రీన్..జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే టెన్నీస్ స్టార్ సానియా మీర్జా దృష్టిలో పడింది.   హైదరాబాద్‌లోని తన అకాడమీలో ఆమెకు సానియా మీర్జా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించింది. 

జాఫ్రీన్ విజయాలు...
2012లో పంజాబ్‌లో జరిగిన పోటీల్లో పసిడి పతకం సాధించిన జాఫ్రీన్ ..ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో సిల్వర్ను సొంతం చేసుకుంది. 2013లో బల్గేరియాలో జరిగిన డెఫిలింపిక్స్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. 2014 జర్మనీలో జరిగిన హంబర్గ్‌ టెన్నిస్‌ కప్‌లో సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో  రజత పతకం సాధించింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన ప్రపంచ డెఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. 2015లో 8వ ఆసియా పసిఫిక్‌ గేమ్స్‌లో బ్రౌంజ్ మెడల్ను కైవసం చేసుకుంది. 2016లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో  బంగారు పతకంతో మెరిసింది. 2017లో డెఫిలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తాజాగా 2022లో డెఫిలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో  కాంస్య పతకంతో దేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది.


అన్ని అవయవాలున్నా..కుంటి సాకులతో కాలం వెల్లదీసే ఈ రోజుల్లో..తన లోపాలను అవకాశాలుగా మల్చుకుని..అనుకున్నది సాధిస్తోంది షేక్ జాఫ్రీన్. పట్టుదలకు శ్రమను జోడించి...విజయాలు సాధిస్తోంది. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాక వెలుగులను ప్రసరింపచేస్తోంది.