మా ఫ్యామిలీలో చీలికకు జగనే కారణం : షర్మిల

మా ఫ్యామిలీలో చీలికకు జగనే కారణం : షర్మిల
  •  సీఎం కాగానే మారిపోయారు 

హైదరాబాద్, వెలుగు : వైఎస్ కుటుంబంలో చీలిక రావడానికి కారణం సీఎం జగనేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్​  షర్మిల ఆరోపించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ బుధవారం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. 

స్వలాభం చూసుకోకుండా ప్రచారం చేశా

వైఎస్  కుటుంబం చీలడానికి కారణం సీఎం జగనేనని షర్మిల తెలిపారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ, యావత్ కుటుంబమని చెప్పారు. ‘‘వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి జగన్ మోసగించారు. పార్టీ కోసం నేను నెలల తరబడి 3,200కిమీ పాదయాత్ర చేశా. నా ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి ఎండ, వానల్లో రోడ్ల మీదే ఉన్నా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా. స్వలాభం చూసుకోకుండా జగన్ గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశా.

సీఎం కాగానే జగన్ మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా ఫర్వాలేదు. రాజశేఖర్ రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా. జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన వారంతా బీజేపీకి బానిసలుగా మారారు. రాష్ట్రానికి ఒక్క మేలు చేయని ఆ పార్టీకి దాసోహమయ్యారు” అని షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా కోసం ఏనాడూ జగన్ పోరాటం చేయలేదని షర్మిల విమర్శించారు. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదన్నారు.