ఏపీ అభివృద్ధికి సాయం చేయండి: వైఎస్ జగన్

ఏపీ అభివృద్ధికి సాయం చేయండి: వైఎస్ జగన్
  • అమిత్​ షాను కోరిన ఏపీ సీఎం జగన్
  • గోదావరి జలాల తరలింపుపై ప్రస్తావన

న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ ను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ముందుగా షాకు బర్త్​డే విషెస్ చెప్పారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మొదట తమ పార్టీ ఎంపీలను షా కు జగన్ పరిచయం చేశారు. తర్వాత ఏకాంతంగా చర్చించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్‌‌షాకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌‌ ప్రక్రియ ద్వారా రూ. 838 కోట్లు ఆదా చేశామని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని కోరారు. అందులో రూ.33 వేల కోట్లు భూసేకరణ, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌కు ఖర్చవుతుందని తెలిపారు. ఏపీ సర్కారు ఖర్చుచేసిన రూ. 5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. బుందేల్ ఖండ్, కలహండి తరహాలో ఏపిలో వెనకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. కడపలో స్టీల్‌‌ప్లాంట్‌‌, ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్‌‌ కారిడార్‌‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌‌ లకు నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు కింద రావాల్సిన నిధులు ఇవ్వాలని,  విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు.

గోదావరి జలాల తరలింపుపై కీలక చర్చ

నాగార్జునసాగర్‌‌, శ్రీశైలానికి గోదావరి వరద జలాల తరలింపుపై షాతో జగన్ చర్చించారు. 52 ఏళ్లలో కృష్ణానదిలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందన్నారు. గోదావరిలో ఏటా 2,780 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించే ప్రాజెక్టును చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు.

Jagan Mohan Reddy Meets Amit Shah, Raises Special Status Demand For Andhra Pradesh