కన్నులపండువగా జగన్నాథుడి రథయాత్ర

కన్నులపండువగా జగన్నాథుడి రథయాత్ర
  •  భక్తులతో కిక్కిరిసిన పూరీ
  • జై జగన్నాథ్, హరిబోల్‌‌‌‌ నామస్మరణ తో మార్మోగిన పురవీధులు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం పూరీలో జగన్నాథ రథయాత్ర  కన్నులపండువగా జరిగింది. ఈ ఏడాది రథయాత్రను రెండు రోజులపాటు నిర్వహిస్తుండగా.. ఆదివారం మొదటిరోజు తెల్లవారుజామున రత్నసింహాసనంపై బలభద్ర, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనుడు (చతుర్థామూర్తులు)  కొలువు దీరారు. అనంతరం జగన్నాథుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం పూరీ రాజు గజపతి దివ్యసింగ్​దేవ్​ రథాల ముందు చెరాపహారా  చేశారు. 

 సాయంత్రం సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. 5 గంటలకు సుదర్శనుడు, బలభద్రుని తాళధ్వజాన్ని లాగారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర సోదరి సుభద్ర దర్పదళన్​ రథం, ఆ తర్వాత జగన్నాథుడి నందిఘోష రథం తరలివెళ్లాయి.  దాదాపు 4 వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగారు.  దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ కిక్కిరిసిపోయింది. ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్‌‌’ నామస్మరణతో పుర వీధులన్నీ మార్మోగాయి.  

జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి

రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి శిష్యులతో కలిసి జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రను దర్శించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగన్నాథుడిని దర్శించుకొని, రథాల పరిక్రమ నిర్వహించారు. రాష్ట్రపతికి ఒడిశా సీఎం మోహన్‌‌ మాఝీ, గవర్నర్​ రఘుబర్​దాస్​, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ ఘన స్వాగతం పలికారు.