
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల ఉల్లంఘన ఒప్పందం కుదరడంలో తానే కీలక పాత్ర పోషించానని.. దాడులు ఆపకపోతే వాణిజ్య సంబంధాలు తెంచుకుంటానని ఇరు దేశాలను బెదిరించి దారికి తీసుకొచ్చానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అరిగిపోయిన టేపు రికార్డులా పదే పదే మొత్తుకుంటున్నారు. తాను గనక లేకపోతే పాక్, భారత్ మధ్య అణు యుద్ధమే జరిగిదేని సందు దొరికినప్పుడల్లా ప్రగల్భాలు పలుకుతున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం ప్రమేయం లేదని.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిందని భారత్ చిన్నపిల్లాడికి కూడా అర్ధమయ్యేలా పలుమార్లు చెప్పినా ట్రంప్ తలకు మాత్రం ఈ విషయం ఎక్కడం లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలకు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిమ్మతిరిగి పోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (IDES) 2024 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశ అంతర్గత వ్యవహారాల విషయంలో ఏ బయటి శక్తి (పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ) భారత్‌ను ఆదేశించలేదని తేల్చి చెప్పారు.
‘‘భారత్ సార్వభౌమ దేశం. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా భారత్ సొంతంగా తీసుకుంటుంది. భారతదేశం తన అంతర్గత వ్యవహారాలను ఎలా నిర్వహించాలో నిర్దేశించే శక్తి ఈ గ్రహం మీద ఎవరికి లేదు’’ అని హాట్ కామెంట్స్ చేశారు. భారత ఇతర దేశాలతో దౌత్యపరపంగా సత్సంబంధాలను కొనసాగిస్తోంది. అదే సమయంలో దేశానికి సంబంధించిన అంతర్గత నిర్ణయాలు సొంతంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై పదే పదే స్పందించాల్సిన అవసరం లేదని.. ఇందుకు క్రికెట్‌కు సంబంధించిన ఓ ఉదహరణ కూడా చెప్పారు ధన్‌ఖడ్.
ALSO READ : గాంధీ ఫ్యామిలీకి కళంకం తెచ్చేందుకే..రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీటు: మల్లికార్జున్ ఖర్గే
‘‘క్రికెట్లో ప్రతిబాల్ ఆడలేం. ఒక మంచి ఆటగాడు మంచి బంతులను వదిలి.. చెత్త బంతులను మాత్రమే పరుగులు రాబడతారు. లైన్ అండ్ లెంగ్త్‌లో పడే బంతులు బ్యాటర్లను ఉరిస్తాయి. కానీ అవి ఆడితే ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుంది’’ అని ఉదహరించారు. ట్రంప్ పదే పదే చేసే వ్యాఖ్యలపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వా్న్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ పై విధంగా వ్యాఖ్యానించారు.