సంగారెడ్డి ప్రజలంతా నా ఆత్మబంధువులే : జగ్గా రెడ్డి

సంగారెడ్డి ప్రజలంతా నా ఆత్మబంధువులే : జగ్గా రెడ్డి
  •     నేను ఎప్పుడూ మిమ్మల్ని ఓటర్లుగా చూడను: జగ్గా రెడ్డి
  •     నేను ఏదీ ఓట్ల కోసం చేయను.. చేతనైన సాయం చేస్తా
  •     ఓడిపోయాక సీఎంను ఏ మొహం పెట్టుకుని నిధులు అడగాలని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలంతా తనకు ఆత్మబంధువులేనని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గా రెడ్డి అన్నారు. వాళ్లను ఎప్పుడూ ఓటర్లుగా చూడబోనని, తనకు ఓటేసినా వేయకపోయినా ఎవరిపైనా కోపం లేదన్నారు. తాను ఏదీ ఓట్ల కోసం చేయనని, ఎవరు ఆపదలో ఉన్నా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తనకు చేతనైన సాయం చేశానని, ఇప్పుడూ చేస్తానని సోమవారం ఆయన ఓ ప్రకటనలో చెప్పారు.

ఇటీవల కొన్ని సోషల్​ మీడియా, యూట్యూబ్​ చానెళ్లు, కొన్ని వార్తా సంస్థల్లో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలనుద్దేశించి తాను చెప్పినట్టుగా కొన్ని వార్తలొచ్చాయన్నారు. తాను చెప్పింది కేవలం తనకు ఓటేయని జనాల గురించేనన్నారు. తనకు ఓటేసిన 70 వేల మందికి ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటానని పేర్కొన్నారు. తనను ఓ సారి మున్సిపల్​ కౌన్సిలర్​గా, మున్సిపల్​ చైర్మన్​గా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, కేవలం రెండు సార్లే ఓడిపోయానని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయిస్తానని ఆయన తెలిపారు.  

నేరుగా సీఎంనే అడిగేటోడిని

ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నేరుగా సీఎం రేవంత్​ రెడ్డి దగ్గరకు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి ఇన్ని కోట్లు కావాలంటూ అడిగేవాడినని జగ్గా రెడ్డి చెప్పారు. ఓడిపోయాక ఏ మొహం పెట్టుకుని అడగాలని ప్రజలను ప్రశ్నించారు. అయినా సరే ప్రజలు అనుకున్న పనులు చేయించేందుకు తాను శక్తికొద్దీ ప్రయత్నిస్తానన్నారు. కొన్ని రోజులు మాత్రం దూరంగా ఉంటానన్నారు. త్వరలో కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుస్తానని తెలిపారు. నియోజకవర్గంలో పనులను తన భార్య నిర్మలే చూసుకుంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంతకుముందులాగానే ఆమె ఫుల్​ టైం కేటాయిస్తుందన్నారు.  

అన్ని మతాలవారినీ సమానంగా చూశా

అన్ని మతాల వారినీ తాను సమానంగా చూశానని జగ్గారెడ్డి అన్నారు. ప్రతి దసరా, బోనాలు, శ్రీరామ నవమి, శివరాత్రి, వినాయకచవితి పండుగలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా అందజేస్తానన్నారు. రంజాన్​టైంలో ఇఫ్తార్​ విందు ఇచ్చి, క్రిస్మస్​ పండుగకు కేక్​లు పంపించి సంతృప్తి పడుతానని పేర్కొన్నారు. బీరప్ప, మల్లన్న, భవానీ మాత, ఎల్లమ్మ, మొహర్రం.. ఇలా ప్రతి జాతరకూ ఉత్త చేతులతో వెళ్లనన్నారు.  

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశానని, ఇంటింటికి మంజీరా నీళ్లు, ఒక ఐఐటీ, కలెక్టర్​ ఆఫీస్​, రాజీవ్  పార్క్​, నేషనల్​ రోడ్స్​, లైటింగ్స్​ ఇంకా ఎన్నో తెచ్చానని గుర్తు చేశారు. 2014లో ఓడిపోయినా మెడికల్​ కాలేజీ కోసం పోరాడానని, 2018లో గెలిచాక సభలో పోరాడి సాధించానని చెప్పారు. మరి, బీఆర్​ఎస్​ ఏం చేసిందని ప్రశ్నించారు.