సంగారెడ్డి జడ్పీ మీటింగ్.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు

సంగారెడ్డి జడ్పీ మీటింగ్.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు

సంగారెడ్డి, వెలుగు :  ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రగిల్చింది. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, నారాయణఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో జగ్గారెడ్డి సమస్యలు చెప్పుతుండగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయారు. 

టైం అయిపోయిందని..

జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ శరత్ సమక్షంలో రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. మీటింగ్ కొనసాగుతుండగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్యలో మీటింగ్ హాల్ లోకి వచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ ఆయనను డయాస్ పై కూర్చోవాలని ఆహ్వానించారు. వచ్చి కూర్చున్న జగ్గారెడ్డి సభ్యులందరూ మాట్లాడిన తర్వాత  చివరిలో సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు జడ్పీ చైర్ పర్సన్ అనుమతి కోరారు. దానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అడ్డుపడుతూ ఇప్పటికే సమయం మించిపోయిందని, ఆకలేస్తుందని అనడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అన్ని శాఖల మీద రివ్యూ జరుగుతుండగా స్పందించకుండా చివర్లో టైం అడగడమేంటని భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ ‘రాజకీయాలు చేయొద్దు.. నేను సైలెంట్ గా వచ్చాను..  సైలెంట్ గానే వెళ్లేలా సహకరించాలి’ అని అన్నారు. జడ్పీ చైర్ పర్సన్, కలెక్టర్ శరత్ కలగజేసుకుని జగ్గారెడ్డి చెప్పాల్సిన ప్రజా సమస్యలు వినేందుకు పర్మిషన్​ ఇచ్చారు. 35 అంశాలతో కూడిన సమస్యలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరిస్తుండగా ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరికొందరు టీఆర్ఎస్ జడ్పీటీసీలు లేచి బయటికి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ శరత్ కు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలపై 35 వినతి పత్రాలు అందజేశారు.

సమస్యలపై ఏకరువు..

జిల్లాలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు మండిపడ్డారు. ధరణిలో భూ సమస్యలు, చెరువుల ఆక్రమణలు, రోడ్లు, ప్రభుత్వ భూముల కబ్జా, క్రీడా మైదానాలు, పెన్షన్లు, రైతు బీమా, రైతుబంధు, భూముల రిజిస్ట్రేషన్లలో తహసీల్దార్ల అక్రమ వసూళ్లు, గ్రామకంఠం భూముల పరిరక్షణ తదితర అంశాలపై మండలాలవారీగా తలెత్తుతున్న ఇబ్బందుల గురించి సభ్యులు వివరించారు. దళిత బంధు, ఎస్టీ బంధు పథకాల మాదిరిగా ఓసీ బంధు కూడా ప్రకటించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పటాన్ చెరు ఎంపీపీ సుష్మ శ్రీ కలెక్టర్ శరత్ కు ప్రతిపాదించారు. ఓసీ వర్గాలలో కూడా చాలామంది పేదవారు ఉన్నారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

ప్రోటోకాల్ రగడ

జిల్లాలోని వివిధ మండలాలకు అధికారులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా తమను పిలవడం లేదని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు కలెక్టర్ శరత్ కు ఫిర్యాదు చేశారు. మండల స్థాయిలో ఉన్న సమస్యలు అధికారులకు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండకపోగా తమకు సమాచారం లేకుండా వచ్చి వెళ్తున్నారని టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ కూడా అధికారుల తీరును తప్పుబడుతూ జిల్లా కలెక్టర్ కు వివరించారు. కాగా, దీనిపైనే దాదాపు గంటకుపైగా చర్చ జరగగా శరత్ స్పందిస్తూ కలెక్టర్ గా తనకు ఇది మొదటి జడ్పీ సమావేశమని, ఇక నుంచి అలా జరగదని సభ్యులకు హామీ ఇచ్చారు.

పొరపాట్లను చక్కదిద్దండి

మండలాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.  వెంటనే అధికారులు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు.