సీఎంఆర్ ఇయ్యని మిల్లర్లు ..జగిత్యాల జిల్లాలో ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ జాప్యం

సీఎంఆర్ ఇయ్యని మిల్లర్లు ..జగిత్యాల జిల్లాలో ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ జాప్యం
  •      తనిఖీలు చేసినా తీరు మారని మిల్లర్లు 
  •      ఒక సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన వడ్లు, మరో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందజేత
  •      బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకున్న వైనం
  •      నాటి ప్రభుత్వ పెద్దలే అండగా అక్రమాలకు తెరతీసిన మిల్లర్లు

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం అలాట్​చేసిన వడ్లను బియ్యంగా మార్చి ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. సీజన్లు మారినా కస్టమ్​మిల్లింగ్​రైస్(​సీఎంఆర్) ఇవ్వకుండా బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకొని కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా మిల్లర్లపై తీసుకున్న చర్యలు శూన్యం. కాగా గత ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోనే ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. 

మరోవైపు సీఎంఆర్​తిరిగి ఇవ్వడంలో అధికారులు గడువులు పెంచుతూ పోవడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేల మెట్రిక్ టన్నుల కొద్ది ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి, వారి నుంచి రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడంలో సివిల్​సప్లయీస్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ఫెయిల్​అవుతోంది. కాగా కొద్ది రోజులుగా ఆ శాఖ అధికారులు జిల్లాలోని 30 మిల్లుల్లో తనిఖీలు చేపట్టి ఐదింటికి నోటీసులు ఇచ్చారు.  అక్రమాలు చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్​నేత జువ్వాడి నర్సింగరావు... కలెక్టర్​యాస్మిన్ బాషాను కోరారు. మిల్లులు ఇవ్వాల్సిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా, తాజాగా  జనవరి 31 వరకు అవకాశం ఇచ్చారు. 

నిల్వల్లో భారీ తేడా 

నాటి బీఆర్ఎస్​సర్కార్​పెద్దల సహకారంతోనే మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతంలో సకాలంలో సీఎంఆర్​తిరిగివ్వని కొన్ని రైస్ మిల్లులను అధికారులు బ్లాక్​లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. లీడర్ల అండదండలతో వారికి తిరిగి కేటాయింపులు జరిగాయి. మరోవైపు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై ఆరోపణలు రావడంతో సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేపట్టి నిల్వల్లో భారీ తేడాలున్నట్లు గుర్తించారు. వ్యత్యాసం ఉన్న వడ్లకు అమౌంట్ లెక్కకట్టి చెల్లించాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్లర్లు నాటి బీఆర్ఎస్ నేతల అండదండలతో అక్రమంగా అదనపు నిల్వలున్న మిల్లుల నుంచి ధాన్యం కొలుగోలు చేసి మరీ మళ్లీ కేటాయించేలా ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చారనే అరోపణలు ఉన్నాయి. 

రైస్ మిల్లుల్లో తనిఖీలు..నోటీసులు 

జగిత్యాల జిల్లాలో 67 బాయిల్డ్ రైస్ మిల్లులు, 60 రా రైస్ మిల్లులున్నాయి. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం ధాన్యాన్ని కేటాయించింది.  గత నెలలో ప్రభుత్వానికి సరైన టైంలో సీఎంఆర్​ఇవ్వని 30 మిల్లుల్లో సివిల్​సప్లై ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. నిల్వల్లో భారీ తేడా ఉన్న 5 రైస్ మిల్లులకు నోటీసులు ఇచ్చారు. 2022– 23 వానాకాలం 56,394 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 2,27,967 లక్షల మెట్రిక్ టన్నులతో కలికి మొత్తం 2,84,362 మెట్రిక్ టన్నుల సీఎంఆర్​సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించాల్సి ఉంది. ఈ విషయమై డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం అప్పగించని రైస్ మిల్లులకు నోటీసులు ఇచ్చామని, మిగతా మిల్లర్లకు జనవరి 31 వరకు సీఎంఆర్​అప్పగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. 

‘బీఆర్ఎస్​ సర్కార్​హయాంలో ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ రైస్ మిల్ సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో అధికారులు కేటాయింపులు నిలిపివేశారు. రంగంలోకి దిగిన బీఆర్ఎస్ కీలక నేతలు ఆ మిల్లుకు తిరిగి  కేటాయింపులు చేయించారు. కానీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకుండా,  బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకున్నట్లు ఆ మిల్లుపై ఆరోపణలున్నాయి. గతంలోనూ తనిఖీకి వెళ్లిన ఆఫీసర్లకు రికార్డులకు మిల్లులో నిల్వ ఉన్న వడ్లకు పొంతన లేనట్లు గుర్తించారు. నాటి అధికార పార్టీ లీడర్ల అండదండలు ఉండడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఈ ధాన్యం విలువ దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం’.