
- ఒక్క మార్చి నెలలోనే రూ.16 లక్షలు బిల్లులు పెట్టడంపై అనుమానాలు
- రికార్డుల్లో ఫేక్ బిల్లులు
- ఏడాదిగా రూ.అరకోటి పైగా మాయం?
- ఎంక్వైరీకి ఆదేశించిన అడిషనల్ కలెక్టర్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియాలో నిధులు దుర్వినియోగం, అవకతకవలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలోనూ రిపేర్లకు పోయిన చెత్త ఆటోలు, ట్రాక్టర్ జాడ దొరకకపోగా.. తాజాగా బల్దియాలో రికార్డ్ స్థాయిలో డీజిల్ వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు వచ్చే డీజిల్ ఖర్చు ఈసారి ఏకంగా రూ.16లక్షలకు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆరా తీయాల్సిన ఆఫీసర్లు కూడా సంతకాలు చేసి అక్రమార్కులకు సహకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై మంగళవారం అడిషనల్ కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించారు.
బల్దియా చరిత్రలో రికార్డు స్థాయి వినియోగం
జగిత్యాల బల్దియాలో చెత్త తరలించేందుకు 47 ఆటోలు, 12 ట్రాక్టర్లు, 2 బ్లెడ్ ట్రాక్టర్లు, ఒక డంపర్, స్వీపింగ్ మిషన్, వైకుంఠ రథాలు ఉన్నాయి. వీటిల్లో ఉపయోగించే డీజిల్ ఖర్చు కోసం ప్రతినెలా బిల్లులు పెడతారు. 2024 ఏప్రిల్‌లో రూ.10,20,537 ఖర్చు చేయగా.. మే, జూన్ కలిపి రూ.13,90,590, జూన్‌లో రూ.6,21,010, జులైలో రూ.9,40,173, ఆగస్ట్‌లో రూ.11,65,317, అక్టోబర్‌లో రూ.10,81,260, నవంబర్‌లో రూ.11,23,395, డిసెంబర్‌లో 13,27,160, 2025 జనవరిలో రూ.12,08,354, ఫిబ్రవరిలో రూ.13,76,265 ఖర్చు చేశారు. ఇక మార్చి నెలలో రికార్డు స్థాయిలో రూ. 16, 27,157 లక్షల డీజిల్ వినియోగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫేక్ బిల్లులతో నిధుల దుర్వినియోగం
శానిటేషన్ వాహనాలకు ఏడాది నుంచి కూపన్, జీపీఎస్ వ్యవస్థను వినియోగించడం లేదు. దీంతో రూల్స్‌కు విరుద్ధంగా మాన్యువల్ బిల్లులతో ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. గతంలో రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు వచ్చే డీజిల్ ఖర్చు.. రూ.15లక్షలకు చేరింది. ఈ లెక్కన రూ.అర కోటికి పైగా నిధులు దుర్వినియోగం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. బల్దియా ఆఫీసర్లు అందించే కొన్ని కంప్యూటరైజ్డ్ డీజిల్ బిల్లులో వాహన నంబర్‌తోపాటు డ్రైవర్ సిగ్నేచర్ లేదు.
బల్దియాలోని శానిటేషన్ సెక్షన్‌లో పనిచేసే ఓ ఆఫీసర్ ఫేక్ బిల్లులు సృష్టించినట్లు తెలుస్తోంది. వీటిని ఎలాంటి పరిశీలన చేయకుండా కొత్తగా వచ్చిన పైఆఫీసర్ ఆమోదం తెలపడం, ఆ బిల్లులను కనీసం చూడకుండా నిధులను మరో ఆఫీసర్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో రిపేర్‌కు వెళ్లిన ట్రాక్టర్‌తోపాటు 4 ఆటోల జాడ ఇంకా దొరకలేదు. ఇప్పటికే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంక్వైరీ జరిగినా కొలిక్కి రాకపోవడంపై అనుమానాలున్నాయి.
రికవరీకి ఆదేశాలు
డీజిల్ అవకతవకలపై ఎంక్వైరీ చేయాలని స్పెషల్ ఆఫీసర్, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత 15 రోజుల కింద బల్దియా ఆఫీసర్లను ఆదేశాలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దందాలో తమ బాధ్యతగా ఫేక్ బిల్లులను పరిశీలించకుండా ఆమోదం తెలిపిన ఆఫీసర్లకు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందేమోనని సదరు ఆఫీసర్‌పై చర్యలకు వెనకడుగు వేశారని బల్దియా వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఎంక్వైరీలో జాప్యం కావడంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తాజాగా నిధుల దుర్వినియోగంపై మరోసారి పర్యవేక్షించి నిధులను రికవరీ చేయాలని అడిషనల్ కలెక్టర్ మంగళవారం జగిత్యాల బల్దియా కమిషనర్‌ను ఆదేశించారు.