ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల రూరల్, వెలుగు: జిల్లా మెడికల్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రూ.కోటీ 80 లక్షలతో సిటీ స్కాన్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీలో అత్యధిక వైద్య సేవలు రాష్ట్రంలో అందుతున్నాయన్నారు.

మాతా శిశు ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వివిధ రోగాలతో శస్త్ర చికిత్సలు చేసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి వరం అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బాలముకుందం, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జాన్ లీడర్లు పాల్గొన్నారు.

రూ.70 కోట్లతో క్వాలిటీ రోడ్లు: మినిస్టర్ ​గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో రూ.70కోట్లతో క్వాలిటీ రోడ్లు నిర్మించుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం స్థానిక మీసేవ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. త్వరలో కరీంనగర్ నియోజకవర్గంలో మట్టి రోడ్డు కనిపించకుండా చేస్తామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా రూ.70కోట్లు మంజూరు చేసి, జీఓలు విడుదల చేశారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయితీ రాజ్, ఆర్అండ్ బీ రోడ్లు నిర్మించామన్నారు. మిగిలిన రోడ్లకు ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరైనట్లు మంత్రి పేర్కొన్నారు. రూ.59.30కోట్లతో కొత్తపల్లి, రూరల్ మండలాలకు చెందిన 6 కొత్త రోడ్లు, వరదల వల్ల దెబ్బతిన్న 10 రోడ్లు బాగు చేస్తామన్నారు.

రూ.14.78 కోట్లతో 8 ఆర్అండ్ బీ రోడ్లను రెన్యూవల్ చేస్తామన్నారు. డిసెంబర్ లో పనులు ప్రారంభించి 2023 మార్జి 31లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీలో చేరాలనడం ‘బండి’కి తగదు: కరీంనగర్​ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ టౌన్,వెలుగు: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలని అనడం ఎంపీ బండి సంజయ్​కు తగదని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక అలా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. బండి మాటలతో బీజేపీలో బలమైన లీడర్లు లేరని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

సంజయ్​పాదయాత్రను ఎవరూ ఆదరించడంలేదన్నారు. 4 ఏండ్లలో ఎంపీగా జిల్లాకు ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ రాజశేఖర్ తదితరులు  పాల్గొన్నారు. 

‘బహిరంగ సభను సక్సెస్​ చేయండి’

చొప్పదండి, వెలుగు: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఉప్పు రాంకిషన్ కోరారు. ఆదివారం రామడుగు మండలం వేదిర, రంగసాయిపల్లిలో ప్రజా సంగ్రామ యాత్ర  బహిరంగ సభ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్​15న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్​చార్జి రవీందర్, రాజిరెడ్డి, శ్రీకాంత్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్​చేయాలని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్​రెడ్డి తెలిపారు. ఆదివారం రేకుర్తిలో వారు ప్రచారం చేశారు.  సంజయ్​పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణరెడ్డి, కిసాన్​మోర్చా వెస్ట్​ జోన్ ప్రధాన కార్యదర్శి గోదరి నరేశ్ పాల్గొన్నారు. 

మున్నూరు కాపు గర్జనను సక్సెస్​ చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య


వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో మున్నూరు కాపు కులాల ఐక్యత కోసం హైదరాబాద్​లో నిర్వహించే మున్నూరు కాపు సంఘ గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. ఆదివారం వేములవాడ మున్నూరు కాపు సత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో మున్నూరు కాపు చైతన్య యాత్ర నిర్వహిస్తూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. సమావేశంలో కూరగాయల కొమరయ్య, చిలుక రమేశ్​ కొండ నర్సయ్య, మారం కుమార్, మారం ప్రవీణ్, లక్ష్మణ్ తదితరలు పాల్గొన్నారు. 

25 ఏళ్లకు ఆత్మీయ సమ్మేళనం  

రామడుగు, వెలుగు: మండలంలోని వెలిచాల గ్రామం సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో ఏడో తరగతి(1996–97) చదివిన విద్యార్థులు ఆదివారం సిల్వర్​జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 25 ఏళ్ల తర్వాత బాల్యమిత్రులంతా స్కూల్​లో కలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్‌‌ శ్రీనివాస్, కో కరస్పాండెంట్ సత్యం, టీచర్లు దొంత మోహన్, వీర్ల రామచంద్రరావు, ఆనందం, రమేశ్, సోమయ్య, రవిని పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా సరదాగా గడిపారు. 

  • ఏడున్నరేండ్లుగా ఎదురు చూపులే
  • పెద్దపల్లిలో నత్తనడకన డబుల్​ ఇండ్ల నిర్మాణాలు
  • జిల్లాకు మంజూరైనవి 3,394.. పూర్తయినవి 262, 
  • కడుతున్న ఇండ్లు 1,669.. స్థలం లేక పునాదులు  కూడా తీయనివి 1,463
  • ఆందోళనలో లబ్ధిదారులు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఏడున్నరేండ్లయినా జిల్లాలో ఒక్కరికి కూడా ఇం డ్లు పంపిణీ చేయకపోవడంతో అబ్ధిదారులు ఆందో ళన చెందుతున్నారు. టీఆర్ఎస్​ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించి 3,394 డబుల్ ఇండ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు.

ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఇండ్ల నిర్మాణంలో ఇప్పటికి పూర్తయినవి 262 మాత్రమే. ఇంకా కడుతున్నవి 1,669 కాగా పునాదులు కూడా తీయని ఇండ్లు 1,463 ఉన్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో మంథని మండలంలో 92, కాల్వ శ్రీరాంపూర్​లో 170 మాత్రమే పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం అర్బన్​, మంథని అర్బన్​ లాంటి చాలా ప్రాంతాల్లో స్థలం లేక ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు.

కాంట్రాక్టర్లు దూరం..

నిర్మాణ వ్యయం పెరగడం, జీఎస్టీ తదితర ట్యాక్స్ లతో చాలా ప్రాంతాల్లో డబుల్​ఇండ్లు కట్టడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. ఒక్క డబుల్ బెడ్​రూం ఇంటికి ప్రభుత్వం రూ.5.30 లక్షలు కేటాయించింది. దీంట్లో ఒక్కొ ఇంటి నిర్మాణానికి  రూ.30 వేలు జీఎస్టీ(6 శాతం) కింద పోతోంది. ఈవిధంగా 1000 ఇండ్లు కట్టాలంటే కాంట్రాక్టర్ కు జీఎస్టీ కింది రూ.3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో డబుల్​ఇండ్లు నిర్మించడానికి ఏ కాంట్రాక్టర్ ధైర్యం చేయడం లేదు. 

కట్టిన ఇండ్లు ఇస్తలేరు..

పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాల్వశ్రీరాంపూర్​మండల కేంద్రంలో ఇప్పటికి  262 ఇండ్లు పూర్తయ్యాయి. కనీసం వాటినైనా అర్హులైకు అందించాలని అబ్ధిదారులు కోరుతున్నారు. ప్రతీ ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తున్నామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కట్టిన ఇండ్లు డ్యామేజ్ అవుతుండడంతోపాటు ఇండ్ల పరిసరాల్లో ముళ్లపోదలు పెరుగుతున్నాయి. ఇటీవల పెద్దపల్లి కలెక్టర్ సంగీత రామగుండం, అంతర్గాం మండలాల్లో నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇండ్లను పరిశీలించి, వెంటనే ఇండ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పడంతో త్వరలోనే ఇండ్లు పంపిణీ చేస్తారేమో అని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండ్లు ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం

పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన ఇండ్లు వెంటనే పేదలకు అందించాలి. ఏడు సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తూనే ఉన్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి అధికార పార్టీ లీడర్లకు కాకుండా అర్హులైన పేదలకు అందించాలి. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. - బాలసాని సతీశ్, బీజేపీ లీడర్, పెద్దపల్లి