ఆర్టీసీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆర్టీసీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : సీఎం కేసీఆర్ ఆలోచనలు ఒకలా ఉంటే అమలు మాత్రం మరోలా ఉంటాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పాల ఉత్పత్తిదారులకు లీటర్ కు 4 రూపాయల ప్రోత్సాహకం గత నాలుగేళ్ల నుంచి అందించడం లేదన్నారు. తక్షణమే ప్రోత్సాహం కింద లీటర్ పాలకు నాలుగు రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం ఆస్తులు అన్ని ప్రభుత్వానివే అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ డైరీకి ఆస్తులను ఇస్తే.. కరీంనగర్ పాల డైరీ పేరిట ఆస్తులను మార్చుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందడం లేదన్నారు. బీసీ యాక్షన్ ప్లాన్ అమలు చేయని రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి డేట్ ఆఫ్ అపాయింట్ మెంట్ నుండి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్లను జూనియర్ అసిస్టెంట్లుగా పరిగణించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయొద్దని కేసీఆర్ ఉద్దేశమన్నారు. ఆర్టీసీ కార్మికుల యూనియన్లు కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం రెండు పీఆర్సీ బకాయిలు చెల్లించలేదన్నారు.