
- భూముల ధరలు పెరగడంతో టౌన్‌లో పెరిగిన కబ్జాలు
- ఎఫ్ట్‌టీఎల్ పరిధిల్లోనూ నిర్మాణాలు
- చిన్నపాటి వర్షాలకు జలమయమవుతున్న పట్టణం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రం ఏటా వరద ముంపును ఎదుర్కొంటోంది. నాలాలు, వాగులు కబ్జా కావడంతో వానకాలం వచ్చిందంటే పట్టణాన్ని వరద ముంచెత్తుత్తోంది. దీంతోపాటు విలీన, శివారు గ్రామాల్లోని పంట పొలాలు కూడా వరద బారినపడుతున్నాయి.
జగిత్యాల జిల్లాకేంద్రంగా మారాక శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం పెరగడంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాలు పెరిగాయి. వంద ఫీట్లు ఉన్న వాగులు, నాలాలు కబ్జాకు గురికావడంతోపాటు చెత్తాచెదారం కూడా ముంపునకు కారణంగా తెలుస్తోంది. కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో కొందరు ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
సిటీ ఆఫ్ ఫైవ్ పాండ్స్ కనుమరుగు
జగిత్యాల పట్టణాన్ని ఆనుకుని మోతె, అంతర్గాం, చింతకుంట, కండ్లపల్లి, గోవిందపల్లెల్లో ఐదు గొలుసుకట్టు చెరువులు ఉండగా.. వీటిని కలిపి ‘సిటీ ఆఫ్ ఫైవ్ పాండ్స్’గా పేరుంది. ఇప్పుడు ఆ పేరు కనుమరుగవనుంది. అంతర్గాం నుంచి థరూర్, నర్సింగాపూర్ మీదుగా కెనాల్స్ ద్వారా మోతె చెరువుకు నీరు వచ్చేది. ఈ చెరువు నిండాక కింద ఉన్న ముప్పారపు చెరువుకు వెళ్తుంది. కాగా థరూర్, నర్సింగాపూర్, గోవిందపల్లె భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాకు గురై 80 ఫీట్లు ఉన్న కెనాల్స్ 20–30 ఫీట్లకు తగ్గిపోయింది.
దీంతో భారీ వర్షాలు వస్తే థరూర్–మోతె వాగు పొంగి గోవిందపల్లెలోని వెంకటాద్రినగర్‌కు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వీటితో పాటు మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లోని చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడం, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేయడంతో శివారు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు
జగిత్యాలలో మోతె చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని సర్వే నంబర్ 406 లో 90.23 ఎకరాల విస్తీర్ణం కబ్జాకు గురై 40 ఎకరాలు మాత్రమే మిగిలాయి. అలాగే 269 నుంచి 319 వరకు ఉన్న సర్వే నంబర్లలో 790 ఎకరాల శిఖం భూమిలో 55 ఎకరాలకు పైగా కబ్జాకు గురయ్యాయి. ఈ భూములు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ 280 వరకు ఇళ్లు కూడా నిర్మించారు.
రఘురాములకోట గ్రామం మీదుగా మోతె చెరువు నుంచి ముప్పారపు చెరువుకు వెళ్లే వాగులు, నాలాలు వెళ్తాయి. ఈ గ్రామ పరిసరాల్లో కూడా భూముల రేట్లు పెరగడంతో వాగులు, నాలాలు కబ్జా చేస్తనునారు. మట్టి పోస్తూ ప్లాట్లు చేసి మరీ అమ్మారు. దీంతో చెరువు నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వరద పోటెత్తుతోంది.