జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గాంధీ చౌక్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇవాళ కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో బీజేపీ, రైతు ఐక్య వేదిక నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. గతంలో జగిత్యాల పర్యటనకు వచ్చినప్పుడు కూడా అరెస్టులు చేశారని వారు మండిపడ్డారు. జ్వరం వచ్చినా కూడా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే అక్రమ అరెస్టులు చేయకుండా పర్యటించాలని రైతు నాయకులు కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
