కమీషన్​ ఏజెంట్ల చేతిలో..  జగిత్యాల మ్యాంగో మార్కెట్​

కమీషన్​ ఏజెంట్ల చేతిలో..  జగిత్యాల మ్యాంగో మార్కెట్​

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల మ్యాంగో మార్కెట్ ఉత్తర తెలంగాణ లోనే అతి పెద్దది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడి కాయలను ఢిల్లీ, నాగ్ పూర్, జమ్మూ కశ్మీర్, చండీగఢ్, హరియాణా, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దీంతో యేటా రూ.200 కోట్ల మామిడి బిజినెస్ జరుగుతోంది. ఈ ఏడాది మామిడి సాగులో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షాలు.. నల్ల తామర.. తేనెమంచు పురుగుతో సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మామిడికాయల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి.  గతంలో కిలో మామిడి రూ.25 ఉన్న ధర గతేడాది రూ.15 కు పడిపోయింది. ధర తగ్గేందుకు కమీషన్ ఏజెంట్లే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఆఫీసర్లు, లీడర్లు వచ్చే ఏడాది ఓపెన్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఈ ఊసే ఎత్తడం లేదు. ఈ సారి కూడా కమీషన్ ఏజెంట్ చెప్పిందే ధర ఫైనల్ కావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఏటా కమీషన్ ఏజెంట్లదే హవా..

అగ్రికల్చర్ మార్కెట్ వాళ్లు కమీషన్ ఏజెంట్ లైసెన్స్ లు జారీ చేస్తారు. మార్కెట్​లో సుమారు 80 మందికి ఈ లైసెన్సులు ఉన్నాయి. ఏటా వీళ్లే బిజినెస్ చేస్తున్నారు. వీరు రైతులు పండించిన మామిడికాయల రకాలను చూసి రేట్ నిర్ణయిస్తారు. మార్కెట్లో మామిడికాయకు రేటు ఉన్నా కమీషన్ ఏజెంట్లు సిండికేట్ గా మారి రేటు నిర్ణయిస్తారు. దీంతో తాము తీవ్రంగా నష్టంగా పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు కమీషన్ ఏజెంట్లు సంబంధిత ఆఫీసర్ల సమక్షంలో కాయను బట్టి రేటు నిర్ణయిస్తారు. కాయ బాగుంటే కమీషన్ ఏజెంట్లు పోటీ పడి మరి కొనే అవకాశాలు ఉంటాయి. ఓపెన్ యాక్షన్ ఏర్పాటు చేస్తే నేరుగా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కాయలు కొనొచ్చు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.

ఈ ఏడాది డౌటే..?

జగిత్యాల మ్యాంగో మార్కెట్ కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర లోని నాగ్ పూర్, చంద్రాపూర్ తో పాటు ఢిల్లీ మార్కెట్ లో 70 శాతం వాటా జగిత్యాల మ్యాంగోదే. అలాగే మరో నాలుగు రాష్ట్రాలతో పాటు గల్ఫ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. జగిత్యాల మ్యాంగో మార్కెట్ కు జగిత్యాల జిల్లా తో పాటు మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మామిడి వస్తుంది. సుమారు 35 వేల ఎకరాల్లో 1.5 లక్షల టన్నుల మామిడి పండుతోంది. ఏటా రూ.200 కోట్ల బిజినెస్ జరుగుతోందని ఆఫీసర్ల అంచనా. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నా రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. సిండికేట్ గా మారిన కమీషన్ ఏజెంట్లు రైతుల నుంచి కొన్న మామిడిని రెండింతలు ఎక్కువ రేటుకు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. ఓపెన్ మార్కెట్ అమలు చేస్తే వ్యాపారులే పోటీపడి కొనుగోలు చేసే అవకాశాలుంటాయని రైతులు అంటున్నారు. మరో వైపు మ్యాంగో మార్కెట్ లో మరమ్మత్తు పనులు నడుస్తున్నాయని.. అందుకే ఈ ఏడాది ఓపెన్​ మార్కెట్​ను ఏర్పాటు చేయలేదని అధికారులు అంటున్నారు. వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని  చెబుతున్నారు.

ఈసారి మామిడి తోటలతో నష్టం

మామిడి కాయకు ఈ యేడు మంగు రోగం వచ్చింది. గతేడాది 5 ఎకరాల్లో 20 నుంచి 25 టన్నుల మామిడి వచ్చేది.ఈసారి పది టన్నులు దిగుబడి రావడం కష్టమే. జగిత్యాల మామిడి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారు. అదే నాగ్ పూర్ మార్కెట్లో ఓపెన్ టెండర్ పాట పాడి కొనుగోలు చేస్తారు. దూరం ఎక్కువ అయినా నాగ్ పూర్ వెళ్తే ఫాయిదా.

- తొంటి మల్లేశం, మామిడి రైతు, బతికే పెల్లి

వచ్చే ఏడాది ఓపెన్ మార్కెట్

మ్యాంగో మార్కెట్​లో రూ.6 కోట్ల తో షెడ్లు ఏర్పాటు చేశాం. అదనంగా మరో పది ఎకరాలు కేటాయించడం తో తాత్కాలిక ఏర్పాట్లు చేశాం. మే మొదటి వారంలో మార్కెట్​కు కాయ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో మరమ్మతులు చేపట్టడంతో వచ్చే ఏడాది ఓపెన్ మార్కెట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- రాజశేఖర్, మార్కెట్ కమిటీ సెక్రటరీ, జగిత్యాల