
- జగిత్యాల జిల్లాలో 693 మంది అనుమానితుల జాబితా రెడీ
- భూదందాలు, కబ్జాల కట్టడికి ప్రయత్నం
- రౌడీషీటర్లకు వరుస కౌన్సిలింగ్‌లు, బైండోవర్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఇల్లీగల్యాక్టివిటీస్పై పోలీసులు నిఘా పెట్టారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాలతో స్టేషన్‌వారీగా రౌడీ షీటర్లను పిలిపించి కేసుల వారీగా విచారణ చేస్తున్నారు. గతంలో రౌడీ షీట్ రికార్డుల్లో ఉన్నవారు, ఇతర కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. అవసరమైతే బైండోవర్లు చేస్తూ క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో అనుమానితుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు.
దీంతోపాటు జిల్లాలో గంజాయి రవాణా, వినియోగం, గుట్కా, మట్కా, భూ కబ్జాలు, దోపిడీలు నియంత్రణపై పోలీసులు దృష్టి పెట్టారు. జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మెట్ పల్లి, మల్యాల వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో జనాల్లో రియల్ మాఫియా ఆగడాలు పెరిగాయి. కొందరు రాజకీయ నాయకులు భూ కబ్జాలకు రౌడీ షీటర్లను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిపై నిఘా పెంచినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
జిల్లాలో 693 మంది అనుమానితులతో జాబితా
జిల్లాలో రౌడీలు, దొంగలు, సస్పెక్టులు, కమ్యూనల్ కేసుల్లో ఉన్నవారు.. మొత్తం 693 మంది అనుమానితుల జాబితాను పోలీసులు సిద్దం చేశారు. జగిత్యాల టౌన్ సర్కిల్‌లో 79 మంది, మల్యాల సర్కిల్ పరిధిలో 75 మంది, ధర్మపురి సర్కిల్‌లో 115 మంది, జగిత్యాల రూరల్ సర్కిల్ లో 112 మంది, మెట్‌పల్లి సర్కిల్‌లో 142 మంది, కోరుట్ల సర్కిల్‌లో అత్యధికంగా 170 మంది ఉన్నారు. కోరుట్ల పీఎస్ లోనే 124 మంది ఉన్నారు.
వీరిలో డోసియర్ క్రిమినల్స్ జాబితాలో 23 మంది, నోన్ డిప్రెడేటర్స్ 13 మంది, రౌడీలు 208 మంది, సస్పెక్టులు 315 మంది, కమ్యూనల్ కేసులు ఉన్నవారు 25 మంది, ట్రాఫికర్స్ 6 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిని మూడు గ్రేడ్‌లుగా విభజించి, మొదటి గ్రేడ్‌వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తూ మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
జిల్లాలోని ప్రజల భద్రత కోసం రాజీపడే ప్రసక్తే లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్ట్ తో పాటు, అవసరమైతే సిటీ బహిష్కరణ కూడా అమలు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. -అశోక్ కుమార్, జగిత్యాల ఎస్పీ