జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు పూర్తి

జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు పూర్తి

యాదాద్రి, వెలుగు : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గ్రంథాలయోద్యమ నేత జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు గురువారం ముగిశాయి. అనారోగ్యంతో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న మల్లయ్య  గుప్తా (97) బుధవారం రాత్రి హైదరాబాద్​లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు, నలుగురు కొడుకులు ఉన్నారు. అభిమానుల సందర్శన కోసం ఆయన మృత దేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి భువనగిరికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్​ కొలుపుల అమరేందర్​, బట్టు రాంచంద్రయ్య సహా అనేకమంది మల్లయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. తర్వాత ఆయన మృతదేహాన్ని భువనగిరి నుంచి హైదరాబాద్​కు తరలించారు. అభిమానుల చివరి చూపు కోసం ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని ఆర్టీసీ కల్యాణ మండపంలో కొద్దిసేపు ఉంచారు. తర్వాత అంబర్​పేట శ్మశానవాటిక వరకూ ర్యాలీ తీసి అంత్యక్రియలు నిర్వహించారు. 

జనంలో చైతన్యం కోసం..

తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న మల్లయ్య గుప్తా 1926 అక్టోబరు 11న లక్ష్మమ్మ, నారాయణ దంపతులకు జన్మించారు. ప్రస్తుత యాదాద్రి జిల్లా భువనగిరిలో చిన్న వ్యాపారం చేసే మల్లయ్య గుప్తా 1942లో నిజాం పాలనపై నిరసన గళమెత్తారు.  తోటి వ్యాపారుల సహకారంతో జనంలో చైతన్యం తీసుకొచ్చారు. నిజాంకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి, ఉద్యమాన్ని విస్తరించారు. రాజ్‌బహుదూర్‌గౌడ్‌, బూర్గుల నర్సింగ్‌రావు, రావి నారాయణరెడ్డి, ఆర్య సమాజ్‌ నరేంద్ర, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కుర్రారం రాంరెడ్డి వంటి నేతల ప్రభావంతో కమ్యూనిస్టులు నిర్వహించిన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఆయనపై అప్పట్లోనే16 కేసులు నమోదయ్యాయి. 10 నెలల పాటు  జైలు జీవితాన్ని గడిపిన ఆయన పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. ప్రజల్లో చైతన్యం కోసం  గ్రంథాలయోద్యమంలో పాల్గొని లైబ్రరీలను నెలకొల్పారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ మల్లయ్య గుప్తా క్రియాశీలకంగా పాల్గొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సాహితీ మిత్ర మండలి పేరుతో తెలంగాణ ఉద్యమానికి సహకరించారు.