ప్రైవేట్ హాస్పటిల్స్ కు దీటుగా వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రైవేట్ హాస్పటిల్స్ కు దీటుగా వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రైవేట్ కు దీటుగా వైద్యం అందించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు. ఆదివారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లతో సమావేశమయ్యారు. ముందుగా ఆస్పత్రి వార్డుల్లో పర్యటించి వైద్యం అందుతున్న తీరును పేషెంట్లతో చర్చించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు డ్యూటీ టైమింగ్స్ పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇప్పటికే డెలివరీలు, సర్జరీ విషయంలో ముందున్నటువంటి ఏరియా ఆస్పత్రి ఇదే తరహా వైద్యం కొనసాగించాలని సూచించారు. హాస్పిటల్ లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్​శ్రీనివాస్ సమరద్ ఉన్నారు. 

పదేండ్లు మున్సిపల్ నిధులు దోచుకున్నరు

డ్రైనేజీ కాల్వల పూడికతీత పేరిట పదేండ్లు బీఆర్ఎస్​ నాయకులు మున్సిపల్ నిధులు దోచుకున్నారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ కాల్వలను మున్సిపల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ కాల్వల్లో మొక్కుబడిగా పూడిక తీసి లక్షల్లో బిల్లులు డ్రా చేసి ప్రజలకు దుర్వాసనను కానుకగా ఇచ్చారని మండిపడ్డారు. 

గత పదేండ్లలో ఎన్నిసార్లు కాల్వల్లో పూడిక తీశారు.. ఎంత బిల్లులు డ్రా చేశారనే నిజాలను ప్రజల ముందు పెడతామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ కాల్వలను త్వరగా క్లీన్ చేయాలని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, రవినాయక్, సుందర్ నగర్ వార్డ్ ఇన్​చార్జి అబ్దుల్లా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మధురెడ్డి నర్సిరెడ్డి, జానకిరామ్ రెడ్డి, అశోక్, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.