Bengaluru Rains: బెంగళూరులో వర్ష భీభత్సం.. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు..

Bengaluru Rains: బెంగళూరులో వర్ష భీభత్సం.. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు..

Bengaluru Weather: ఎండాకాలం ఒకపక్క దంచికొడుతుంటే మరోపక్క అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు నగరం అకాల వర్షాలతో అతలాకుతలం అయ్యింది. అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రస్తుతం కర్ణాటకలోని దాదాపు 18 జిల్లాల్లో మే 24 వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతారవరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా అందించింది. ప్రధానంగా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, బాగల్‌కోట్, బెల్గాం, బీదర్, ధార్వాడ్, గడగ్, హావేరి, చిక్కమగళూరు, చిత్రదుర్గ, హసన్, కొడగు, శివమొగ్గ, తుమకూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు దాని చుట్టుపక్క ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

Also Read : వంకాయలు కిలో పది రూపాయాలా.? వ్యాపారిపై రైతన్న ఆగ్రహం..రోడ్డుపై నిరసన

గడచిన మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆఫీసులకు వెళ్లటానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. అనేక చోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయి అస్తవ్యస్తంగా మారటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని జలహల్లి క్రాస్, యశ్వంత్‌పూర్, మల్లేశ్వరం, శివానంద సర్కిల్, మెజెస్టిక్, టౌన్ హాల్, కెఆర్ మార్కెట్, ఎంజి రోడ్ ప్రాంతాల్లో నిలిచిపోయిన నీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల ఇళ్లల్లోకి సైతం భారీగా వరద నీరు చేరుకుందని అక్కడి వారు చెబుతున్నారు. 

ఒక్కసారిగా పడిన వర్షాలతో సందుల్లో అపార్ట్మెంట్ సెల్లార్లలో నీరు మోకాళ్ల లోతు వరకు నిలిచిపోయింది. ప్రధానంగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోటం నీరు నిలిచిపోవటానికి కారణంగా ప్రజలు అంటున్నారు. దీంతో సందులు నీటి సరస్సులుగా కనిపిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు లోకల్ ఎమ్మెల్యే బి బసవరాజ్ జేసీబీపై ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే వర్షాల ప్రభావం మరికొన్ని రోజులు మిగిలే ఉండటంతో ప్రజలు కనీస అవసరాలకు కూడా ఇబ్బంది ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.