
హనుమకొండ జిల్లా పరకాల కూరగాయల మార్కెట్ లో రైతులు నిరసనకు దిగారు. వంకాయలు రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు . కిలో 40 రూపాయలు కొనుగోలు చేస్తామని వంకాయలు తీసుకురమ్మన్న వ్యాపారులు తీరా మార్కెట్ కు వచ్చాక రేటు లేదని చెప్పడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రవాణా ఛార్జీలు పెట్టుకుని మరీ మార్కెట్ కు తీసుకొస్తే ధర లేదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని వ్యాపారులపై మండిపడ్డారు రైతులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచ్నిపల్లికి చెందిన రైతు ప్రభాకర్ రెడ్డి ఇవాళ మే 19న వంకాయలు తీసుకొచ్చాడు. ముందుగా రూ. కేజీకి రూ.40 ఇస్తామని రైతుకు చెప్పారు వ్యాపారులు. దీంతో రైతు పొద్దున్నే వంకాయలు తీసుకుని మార్కెట్ కు వచ్చాక కిలో రూ.10 చెల్లిస్తామని వ్యాపారులు చెప్పారు. దీంతో వ్యాపారుల తీరుపై రైతు ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోడ్డుపై కూరగాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశాడు. పరకాల కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు రైతులను దగా చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దళారీ వ్యవస్థతో రైతులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూలీల ఖర్చు, పెట్టుబడి మరో వైపు వ్యాపారస్తుల దోపిడితో రైతులు నిండి మునిగిపోతున్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థపై చర్యలు తీసుకోవాని రైతులు డిమాండ్ చేస్తున్నారు.