
పాలకీడు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకీడు మండలం బెట్టేతండా గ్రామంలో మూసీనదిపై నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్, జాన్పాడులో కృష్ణానదిపై నిర్మిస్తున్న లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూ.33.83 కోట్లతో నిర్మిస్తున్నామని, దీని కింద బెట్టేతండా, పాడేతండా, రాఘవపురం, సజ్జాపురం గ్రామాల్లోని 2,041 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం భూసేకరణ పూర్తయిందని, రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. ఆగస్టు నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
పనుల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం..
జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుకుం జారీ చేశారు. పనుల నత్తనడకపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.270 కోట్లతో నిర్మిస్తున్న జాన్పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుటికీ.. ఇప్పటికీ పెద్దగా తేడా లేదని, పనులు ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్ సీఈ రమేశ్ బాబు, ఎస్ఈ శివ ధర్మతేజ, డీఈ నవికాంత్, ఏఈ సతీశ్, కాంట్రాక్టర్ హన్మంత్ రామ్, అధికారులు తదితరులు
పాల్గొన్నారు.
అన్ని విధాలా అండగా ఉంటాం..
హుజూర్ నగర్, వెలుగు : పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల హుజూర్ నగర్ లో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కౌన్సిలర్ యరగాని గురవయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా గురవయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే మాజీ కౌన్సిలర్ గురవయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, నాయకులు తదితరులు ఉన్నారు.