బీసీలకు తొమ్మిది ఎంపీ స్థానాలివ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు తొమ్మిది ఎంపీ స్థానాలివ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అధినేతలు బీసీలను రాజకీయ పాలేర్లుగా చూస్తున్నారే తప్ప రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం బీసీలున్నా చటసభల్లో మాత్రం ప్రాధాన్యత దక్కడం లేదని వాపోయారు. పార్టీలకు జిందాబాద్‌లు కొడుతూ.. జెండాలు మోసే తమకు జనాభా ప్రాతిపదికన ఎందుకు సీట్లు కేటాయించడం లేదని ప్రశ్నించారు. 

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో  రాజకీయ పార్టీలు కనీసం తొమ్మిది స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. భువనగిరి సీటును బీసీలకు ఇవ్వాల్సిందేనని లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీలకు కావాల్సింది సబ్సిడీలు, రాయితీలు,  సంక్షేమ పథకాలు కాదని,  రాజకీయ వాటా కావాలని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి, పట్టణ అధ్యక్షుడు గుండు నరసింహ గౌడ్,  నేతలు గుండు జ్యోతి గౌడ్,  అక్కెనపల్లి వెంకటరత్నం చారి, బొజ్జ సాంబేశ్, పేరపు రాములు, పర్వతాలు, బలరాం, రాజు, రవి తదితరులు ఉన్నారు.