జూన్‌ 30 వరకూ జామా మసీదు మూసివేత

జూన్‌ 30 వరకూ జామా మసీదు మూసివేత

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో చారిత్రక జామా మసీదును ఇవాళ(గురువారం,జూన్-11) రాత్రి 8 గంటల నుంచి జూన్‌ 30 వరకూ మూసివేస్తున్నట్టు మసీదు షహీ ఇమాం సయ్యద్‌ అహ్మద్‌ బుఖారి తెలిపారు. మసీదును తిరిగితెరిచిన మూడు రోజుల తర్వాత మూసివేత నిర్ణయం తీసుకున్నారు. సప్థర్‌జంగ్‌ ఆస్పత్రిలో తన కార్యదర్శి అమానుల్లా కరోనా మహమ్మారితో మరణించిన రెండు రోజుల తర్వాత షహీ ఇమాం మసీదు మూసివేత నిర్ణయం ప్రకటించారు. జూన్‌ 3న కరోనా వైరస్‌తో బాధపడుతూ అమానుల్లా ఆస్పత్రిలో చేరారు.

లాక్ డౌన్ లో భాగంగా దేశవ్యాప్తంగా కొంతకాలం పాటు మసీదులను మూసివేయాలని బుఖారీ విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ప్రజలు ఇంటి దగ్గరనే నమాజ్‌ చేసుకునేలా ఇతర మసీదులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. లాక్‌ డౌన్‌ లోనే ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల తర్వాత సోమవారం జామా మసీదు తలుపులు తెరుచుకున్నాయి. వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ మసీదు మూసివేయాలని షహీ ఇమాం సయ్యద్ బుఖారి నిర్ణయించారు.