
'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు ధీరుడు ఎస్. ఎస్. ఎరాజమౌళి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలసి 'SSMB29' సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించబోతున్నారనే ఊహాగానాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇండియాకి జేమ్స్ కామెరూన్ ..
'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామెరూన్ ఈ సంవత్సరం ఇండియాకి రానున్నారని సమాచారం. ఈ సమయంలోనే రాజమౌళి--మహేశ్ కాంబో సినిమా టైటిల్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయి అవుతుంది. ఎందుకంటే, గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి జేమ్స్ కామెరూన్ రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. తన సినిమాలో భాగం కావడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ ప్రకటనతో ఆ బంధం మరింత బలపడుతుందని అభిమానులు ఆశపడుతున్నారు.
అంచనాలకు మించిన భారీ ప్రాజెక్ట్
ఈ సినిమా టైటిల్, థీమ్ నవంబర్ 2025లో విడుదల చేస్తామని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో, రఫ్‌గా ఉండే గోధుమ రంగు చొక్కాతో, మెడలో రుద్రాక్షమాల, త్రిశూల్, నంది పెండెంట్‌తో ఉన్న ఒక సాహసికుడి ఛాతీని చూపించారు. ఈ లుక్ సినిమాపై ఉన్న అంచానాలను మరింత రెట్టింపు చేసింది.
ALSO READ : ‘పరదా’ రివ్యూ..
గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ సినిమాగా..
'SSMB29' ఒక గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ సినిమాగా రూపొందుతుందని, ఇందులో మహేశ్ బాబు ఒక సాహసికుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 'ఇండియానా జోన్స్' తరహా అడ్వెంచర్స్, ఆఫ్రికన్ జానపద కథల నుంచి ఈ కథను స్ఫూర్తిగా తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా బడ్జెట్ అంచనాలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.900 నుంచి-1000 కోట్లతో రూపొందిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం, సినిమా షూటింగ్ కీలక దశలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించగా, త్వరలోనే దక్షిణాఫ్రికాలో కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. సినిమా టైటిల్ రివీల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన మూవీ మేకర్స్ నుంచి వెలువడాల్సి ఉంది.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025