స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ
  • నెల రోజుల్లో స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ
  • ల్యాగ్రేంజ్ పాయింట్​కు చేరిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు

వాషింగ్టన్: విశ్వం తొలినాళ్ల ఫొటోలను తీసేందుకు అమెరికా, కెనడా, యూరోపియన్ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా పంపిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు అంతరిక్షంలో తన ఫైనల్ డెస్టినేషన్ కు చేరుకుంది. గత క్రిస్మస్ రోజున ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా నింగికి చేరిన ఈ టెలిస్కోపు.. రోజుకు యావరేజ్​గా 50 వేల కి.మి. ప్రయాణిస్తూ.. నెల రోజుల్లో మొత్తం 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని నాసా వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజాము సమయం కల్లా సెకండ్ ల్యాగ్రేంజ్ పాయింట్ (ఎల్2) వద్దకు చేరుకున్నట్లు ప్రకటించింది. 

హ్యాలో ఆర్బిట్ లో సూర్యుడి చుట్టూ.. 
గతంలో ప్రయోగించిన హబుల్ స్పేస్ టెలిస్కోపు భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో తిరుగగా, దానికి సక్సెస్సర్ గా పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు మాత్రం సెకండ్ ల్యాగ్రేంజ్ పాయింట్​లోని హ్యాలో ఆర్బిట్ లో సూర్యుడి చుట్టూ తిరుగనుంది. వచ్చే జూన్ లేదా జులై కల్లా విశ్వం ఫస్ట్ ఫొటోను జేమ్స్ వెబ్ భూమికి పంపనుంది.