సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కోల్‌బెల్ట్, వెలుగు : జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో శనివారం జరిగిన సీపీఎం మహాసభల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదో మూడో సారి గెలిచినా పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు కులగణన చేపట్టడాన్ని సీపీఎం స్వాగతిస్తుందన్నారు. మతం, డబ్బు పేరుతో అధికారంలో కొనసాగడమే బీజేపీ సంస్కృతి అని అన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి మొదటగా ఫార్మా కంపెనీలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, రూ.25 వేలు ఇచ్చిన తర్వాతే వారి ఇండ్లను తొలగించాలన్నారు. హైడ్రా పేరుతో చెరువులు, కాల్వలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల తొలగింపును సీపీఎం సైతం సమర్థించిందన్నారు.. అయితే పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్ తప్ప మిగతా హామీలు అమలు జరిగే పరిస్థితి లేదన్నారు. ఖజానా ఖాళీ అయిందన్న సాకుతో వాగ్ధానాల అమలులో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జి. రాములు, భూపాల్, పైళ్ల ఆశయ్య పాల్గొన్నారు.