జమ్మూకశ్మీర్​ మార్పులతో కొత్తోళ్లకు చాన్స్​

జమ్మూకశ్మీర్​ మార్పులతో  కొత్తోళ్లకు చాన్స్​

ఆర్టికల్​–370 రద్దుతో అందరి దృష్టీ అక్కడ ఆస్తులపై పడింది. అక్కడ చోటుచేసుకునే రాజకీయ, పాలనాపరమైన మార్పులపై పెద్దగా ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి హక్కులకు నోచుకోని ఎస్సీ, ఎస్టీ, గుజ్జర్లు, పహాడీల వంటి వర్గాలకు ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశించే అవకాశం లభిస్తుంది. రాజకీయంగా వెనుకబడ్డ జమ్మూ ఏరియా నుంచి సీఎం కాగలుగుతారు. రిక్రూట్​మెంట్​ వ్యవహారాల్లో యూపీపీఎస్సీ పాత్ర పెరుగుతుంది. న్యాయ, పాలన, శాసనవ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి.

జమ్మూ కాశ్మీర్​ నెల్లాళ్లుగా దేశంలో రాజకీయ సంచలనాలకు సెంటర్​ పాయింట్​ అయ్యింది. ఆర్టికల్​–370 రద్దుతో జరిగే మార్పులేమిటనే విషయంలో ఎవరికి తోచిన ఎనాలిసిస్​ వాళ్లు ఇచ్చేస్తున్నారు. అక్కడ చోటుచేసుకోబోయే ముఖ్యమైన మార్పు పాలనా పరమైనది. దాదాపు 70 ఏళ్లపాటు అసెంబ్లీతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్​ ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీలు)గా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్​ రెండు ప్రాంతాలు కలిసి అసెంబ్లీతోకూడిన యూనియన్​ టెరిటరీగానూ, లఢఖ్​ అసెంబ్లీ లేని యూటీగానూ మారాయి. కాశ్మీర్​లో న్యాయ వ్యవస్థ సహా అసెంబ్లీలో సీట్ల సంఖ్య, మంత్రుల సంఖ్య వంటి అనేక అంశాల్లో మార్పులు రాబోతున్నాయి.‘జమ్మూ కాశ్మీర్  రీ–ఆర్గనైజేషన్ యాక్ట్ 2019’ ప్రకారం ఈ డెవలప్​మెంట్స్​ రానున్నాయి. అసెంబ్లీతో కూడిన జమ్మూ కాశ్మీర్ యూటీలో ప్రస్తుతం107 సీట్లున్నాయి. ఇవి మరో ఏడు పెరగనున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 114 కానుంది. అయితే, వీటిలో 24 సీట్లు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)’లో ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి ఈ 24 సీట్లు భర్తీ కావలసి ఉంటుంది. ఇప్పటివరకూ అక్కడ ఎన్నికలు జరగలేదు. కేవలం జమ్మూ, కాశ్మీర్​, లఢఖ్​ ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లకే ఎన్నికలు జరుగుతుంటాయి.

కొత్త మార్పుల్లో జమ్మూ ప్రాంతానికి ఎక్కువ లాభం జరగబోతోంది. కాశ్మీర్​తో పోలిస్తే గతంలో జమ్మూ పట్ల వివక్ష కొనసాగిందని బీజేపీ ఎప్పట్నుంచో భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్)తోనే జమ్మూకు న్యాయం జరుగుతుందని గతంలో అనేకసార్లు బీజేపీ కామెంట్ చేసింది. జమ్మూకు న్యాయం చేయడానికి డీలిమిటేషన్ చేపట్టాలని బీజేపీ ఎన్నిసార్లు కోరినా, అప్పటి కాశ్మీర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నియోజకవర్గాల పునర్విభజనను 2016 వరకు పాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వాయిదా వేసింది. దీంతో డీ లిమిటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఆర్టికల్–370 రద్దుతో జమ్మూ కాశ్మీర్​కి సంబంధించిన అన్ని అంశాలపై  కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.  యూటీగా మారిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎస్సీలు, ఎస్టీలు, గుజ్జర్లతో పాటు మరికొన్ని కమ్యూనిటీలకు సీట్లను రిజర్వు చేస్తారు. హిందీ సహా ఏ భాషనైనా ఎంచుకునే  వెసులుబాటు అక్కడివారికి దక్కుతుంది.

రాజకీయంగా చోటుచేసుకునే మార్పులు

కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్​లో ఐదు లోక్​సభ సీట్లు ఉంటాయి. అలాగే ఇక్కడి నుంచి నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. లడఖ్ యూటీలో ఒకే ఒక్క లోక్​సభ సీటు ఉంటుంది.  ఇక, నిన్న మొన్నటివరకు జమ్మూ కాశ్మీర్​లో ముఖ్యమంత్రి సహా 24 మంది మంత్రులు ఉండేవారు. పునర్విభజన చట్టం ప్రకారం కేబినెట్ సంఖ్యపై కోత పడబోతోంది. సీఎం సహా మంత్రుల సంఖ్య మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో పది శాతం మాత్రమే ఉండాలని యాక్ట్ స్పష్టం చేస్తోంది. ఈ లెక్కన కేబినెట్​ సంఖ్య సగానికి తగ్గిపోనుంది.

లెజిస్లేటివ్  కౌన్సిల్ రద్దు

రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్​కి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉండేది. మొత్తం 34 మంది  కౌన్సిల్​  సభ్యులుగా ఉండేవారు. రీ–ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం శాసనమండలి రద్దయినట్టే.

రెండు యూటీలకు  కేంద్ర చట్టాలు

ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్​లో డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్, కరెన్సీని మినహా మరే ఇతర కేంద్ర చట్టమూ వర్తించేది కాదు. పునర్విభజన చట్టంతో ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ తప్పనిసరిగా అమలవుతాయి.

7 చట్టాలకు సవరణలు

గతంలో 35 ఏ ఆర్టికల్ ప్రకారం పర్మినెంట్ రెసిడెంట్స్ మాత్రమే ఇక్కడ ఆస్తులు కొనడానికి లేదా అమ్మడానికి అర్హులుగా ఉండేవారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లోకూడా వీరికే ప్రవేశం ఉండేది. రీ–ఆర్గనైజేషన్ యాక్ట్ ఈ పరిస్థితికి చెల్లు చీటి ఇచ్చింది. ఆస్తులకు సంబంధించి మొత్తం ఏడు చట్టాలకు సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేసిన దాదాపు 153 చట్టాలను రద్దు చేసేసింది.

లెఫ్టినెంట్ గవర్నరుగా సత్యపాల్ మాలిక్

జమ్మూ కాశ్మీర్​కి గవర్నర్​గా ఉన్న సత్యపాల్ మాలిక్  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్​గా ఉంటారని అధికార వర్గాల కథనం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పదవీ కాలం ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జమ్మూ ప్రాంతానికికూడా ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.