
- కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన జమ్మూకాశ్మీర్ సీఎం అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్, లడఖ్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో జాప్యం చేయడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి హరీందర్ బవేజా రాసిన ‘దే విల్ షూట్ యు, మేడమ్: మై లైఫ్ త్రూ కాన్ ఫ్లిక్ట్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ప్రభుత్వం తన సొంత రోడ్ మ్యాప్ ను అనుసరించడంలో విఫలమైందని తెలిపారు.
మొదట జమ్మూకాశ్మీర్, ఇప్పుడు లడఖ్‌ను అసాధ్యమైన హామీలతో తప్పుదారి పట్టించిందన్నారు. ‘‘హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో లడఖ్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. దాదాపుగా అసాధ్యమని తెలిసినా.. లడఖ్‌ను ఆరో షెడ్యూల్లో చేరుస్తామని చెప్పారు.
ఒక వైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకునే లడఖ్‌కు గట్టి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అటువంటి ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్లో చేర్చడం దాదాపు అసాధ్యం. అయినా ఎన్నికల కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు” అని అబ్దుల్లా విమర్శించారు.