వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జానా, గుత్తా కొడుకులు రె‘ఢీ’

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జానా, గుత్తా కొడుకులు రె‘ఢీ’
  • తన కొడుకు పోటీ చేస్తాడని ప్రకటించిన కాంగ్రెస్​ సీనియర్​ నేత కె. జానారెడ్డి
  • ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగిన మండలి చైర్మన్​ 
  • గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, కాంగ్రెస్​ అగ్రనేతల కొడుకుల పొలిటికల్ ​ఎంట్రీకి లైన్​ క్లియర్​అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి తన కొడుకు  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్​లో ఆయన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్​లో ఈ మేరకు కొంత క్లారిటీ ఇచ్చారు. జానారెడ్డి ఇద్దరి కుమారుల్లో రఘువీర్​రెడ్డి పోటీ చేస్తాడా? లేక జయవీర్​రెడ్డిని బరిలోకి దింపుతారా అనే విషయాన్ని జానా సస్పెన్స్​గానే ఉంచారు. మొదటి నుంచి మాత్రం జానా రెడ్డి పెద్ద కొడుకు రఘువీర్​రెడ్డి పొలిటికల్​ఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల్లోనే రఘువీర్​ మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ పార్టీలో ఈక్వేషన్స్​ కుదరక ఛాన్స్ మిస్​అయింది. మళ్లీ నాగార్జునసాగర్​ఉప ఎన్నికల్లో రఘువీర్​ పేరు తెరపైకి వచ్చింది. కానీ సాగర్​ ఉప ఎన్నికని కాంగ్రెస్​పార్టీ ప్రిస్టేజి​గా తీసుకోవడంతో జానారెడ్డికి పోటీ చేయక తప్పలేదు.76 ఏళ్ల వయసు ఉన్న జానారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడే కొడుకు పొలిటికల్​ఎంట్రీ జరిగితే బాగుంటుందని ఆయన వర్గీయులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.  

ఇద్దరు కొడుకుల్లో ఎవరు..?  

జానారెడ్డి ఇద్దరు కొడుకుల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే ది ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ జానా వర్గీయులు మాత్రం రఘు వీర్​ పోటీ చేస్తారని భావిస్తున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డ రఘువీర్ కి సానుకూలాంశంగా భావిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే మిర్యాలగూడ నుంచే పోటీ చేస్తారని కూడా చెపుతున్నారు. అయితే ఇటీవల రఘువీర్​తో పాటు జయవీర్​ సైతం క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రితో సాగర్, మిర్యాలగూడలో పర్యటించడంతో పాటు, గాంధీభవన్​ పెద్దలతో  టచ్ లో ఉన్నాడని చెపుతున్నా రు. ఈ నేపథ్యంలో వీళ్లలో ఎవరో ఒకరు మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, జానారెడ్డి నాగార్జునసాగర్​లో పోటీ చేస్తే కొడుకు మిర్యాలగూడ నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు. ఒకవేళ పార్టీ ఈక్వేషన్స్​ కుదరకపోతే కుమారుడు నల్గొండ ఎంపీగా పోటీ చేసే అవ కాశం ఉందని జానా వర్గీయులు చెపుతున్నారు.

బీఆర్ఎస్ నుంచి అమిత్​ రెడ్డి...

బీఆర్ఎస్​ సీనియర్​నేత, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఆయన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇంకోవైపు మునుగోడు ఎమ్మెల్యే సీటు పైనా అమిత్​ ఫోకస్​ పెట్టారు. పార్టీ హైకమాండ్​ సూచనల మేరకే అమిత్​ గత కొంతకాలంగా నల్గొండ పార్లమెంట్​సెగ్మెంట్​లో జరిగే కార్యక్రమాలకు రెగ్యులర్​గా హాజరవుతున్నారు. ఫస్ట్​ టైం భువనగిరి పార్లమెంట్​పరిధిలోని చిట్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అమిత్​ పాల్గొనడంపై చర్చ జరుగుతుంది.69 ఏళ్ల వయసున్న గుత్తా మండలి చైర్మన్​పదవిలో ఉండగానే కొడుకు అమిత్​ రెడ్డిని ఏదో పదవిలో కూర్చుపెడితే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వారసత్వం కొనసాగుతుందని భావిస్తున్నారు. గుత్తా ఎంపీగా ఇటు నల్గొండ, అటు భువనగిరి సెగ్మెంట్​ల నుంచి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గెలుపు అవకాశాలున్న చోట అమిత్​ రెడ్డిని  పోటీ చేయించే అవకాశం ఉంది.