భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి .. ప్రజావాణిలో కలెక్టర్ ను కోరిన బాధితులు

భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి .. ప్రజావాణిలో కలెక్టర్ ను కోరిన బాధితులు

యాదాద్రి, వెలుగు : భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కలెక్టర్ హనుమంతరావు ను కోరారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 56 ఫిర్యాదులు వచ్చాయి. తమకు తెలియకుండానే 4.32 ఎకరాల భూమిని పట్టా చేయించుకొని తనను పట్టించుకోని కొడుకులపై చర్య తీసుకోవాలని గుండాల మండలం అంబాలకు చెందిన శాంతమ్మ ఫిర్యాదు చేశారు. 

భువనగిరి మండలం గౌస్ నగర్ కు చెందిన మల్లారెడ్డి తన సర్వే నంబర్​ 144, 147లో 17.26 ఎకరాల భూమి ఉందని, ప్రక్కనే 148 సర్వేనంబర్ భూమికి సంబంధించిన వారు తన భూమిని ఆక్రమిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు తమకు పింఛన్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్, ఆయా మండలాలకు చెందిన ఆపీసర్లకు ఫార్వర్డ్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.  

సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలి..

సూర్యాపేట, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ లో జరిగిన ప్రజావాణి 66 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేస్తూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూముల వివరాలను రికార్డుల్లో తప్పని సరిగ్గా నమోదు చేయాలని చెప్పారు ఈనెల 25లోపు సంక్షేమ అధికారులు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.