
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. కాలినడకన కాలనీల్లో తిరిగి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తెలుసుకున్నారు. గాంధీ విగ్రహం నుంచి యాదగిరిపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా డెవలప్ చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్లు, అండర్ డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.
శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్యను తీర్చడం కోసం అమృత్ 2.0 పథకం కింద మూడు పెద్ద వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.