నల్గొండ జిల్లా కాచారం వీవోఏను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి .. వీవోఏలు డిమాండ్

నల్గొండ జిల్లా కాచారం వీవోఏను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి .. వీవోఏలు డిమాండ్

యాదగిరిగుట్ట, వెలుగు : ఎలాంటి తప్పు చేయకున్నా విధుల నుంచి తొలగించిన కాచారం వీవోఏ సంధ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పలువురు వీవోఏలు డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం యాదగిరిగుట్టలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట వీవోఏ సంధ్యతో కలిసి ధర్నా నిర్వహించారు. కాచారం వీవోఏ సంధ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఎం సుధాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ కాచారం వీవోఏ సంధ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విచారణలో తేలినా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే అధికార పార్టీ నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి సంధ్యను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించే అధికారం ఏ అధికారికి ఉండదన్నారు. ఇకనైనా అధికారులు తమ వైఖరిని మార్చుకుని కాచారం వీవోఏ సంధ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 

తప్పని పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చింది..

కాచారం వీవోఏ సంధ్య మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించే క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నారని సదరు మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించానని ఏపీఎం సుధాకర్ తెలిపారు. వీవోఏ సంధ్య చిన్న చిన్న పొరపాట్లు తప్ప.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని విచారణలో తేలిందన్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఆమెను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపారు.