మాటమార్చిన జానారెడ్డి.. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడి

మాటమార్చిన జానారెడ్డి.. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడి

నల్గొండ, వెలుగు: సీఎల్పీ మాజీ  నేత కుందూరు జానారెడ్డి మాట మార్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్​ ప్రకటించినట్టు చెప్పిన ఆయన.. హైకమాండ్​ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్​ కోసం అప్లై చేయడానికి తానేమీ ఆషామాషీ వ్యక్తిని కాదని,  ఏడు సార్లు ఎమ్మెల్యేగా, చాలాకాలం మంత్రిగా పనిచేసిన తాను టికెట్​ కోసం అప్లై చేసుకోవడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. కొడుకులకు బదులు చివరిసారిగా జానారెడ్డినే పోటీ చేయాలని నాగార్జునసాగర్​ కేడర్ ఒత్తిడి చేస్తోంది. 

జానారెడ్డి నిలబడితే బీఆర్​ఎస్ అసమ్మతి వర్గం సపోర్ట్​ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు  చెబుతున్నరు. కమ్యూనిస్టులతో పొత్తు కుదరాలంటే జానారెడ్డి మధ్యవర్తిత్వం అవసరం అవుతుందని, ఆయన క్రియాశీలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కాంగ్రెస్​ పెద్దలు భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని ప్రకటించిన సీనియర్​ నేతల్లో జానారెడ్డి కూడా ఉన్నారు.  జిల్లాలో కాంగ్రెస్​కు పూర్వవైభవం తేవాలంటే జానాతోనే సాధ్యమని కేడర్​ భావిస్తోంది. ఒకవేళ జానారెడ్డి పోటీ చేయాల్సి వస్తే నాగార్జునసాగర్​ నుంచే నిలబడతారని అంటున్నారు.