వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : కలెక్టర్లు రిజ్వాన్భాషా షేక్

వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : కలెక్టర్లు రిజ్వాన్భాషా షేక్

జనగామ అర్బన్/ ములుగు, వెలుగు: వినాయక చవితిని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్లు రిజ్వాన్​భాషా షేక్, దివాకర సూచించారు. సోమవారం జనగామ, ములుగు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలపై అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అధికారులు సిబ్బంది విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

రోడ్లు భవనాల శాఖ బారికేడ్స్​ పటిష్టంగా ఏర్పాటు చేయాలని, విద్యుత్​ అధికారులు నిరంతర విద్యుత్​ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని, భద్రతా పరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, జనగామ కలెక్టరేట్​లో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.  మహబూబాబాద్​ తొర్రూరులో వినాయక చవితి నిర్వహణ ఏర్పాట్లపై డీఎస్పీ కృష్ణ కిశోర్​ పోలీసు సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు.