- జనగామ జిల్లాలో లారీ, కారు ఢీకొని ఇద్దరు..
- నల్గొండ జిల్లాలో రెండు బైక్‌లు ఢీకొని మరో ఇద్దరు మృతి
రఘునాథపల్లి (లింగాలఘనపూర్)/మిర్యాలగూడ/లింగంపేట, వెలుగు : పలు జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలంలోని నవాబుపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఖాజీపేటకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ (28), హనుమకొండకు చెందిన మహమ్మద్ మాసీద్, సమీర్ కారు డ్రైవర్ మహమ్మద్ సుభాని (30)తో కలిసి ఖమ్మంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు.
అక్కడి నుంచి తమ బంధువు మహ్మద్ నూర్‌ను తీసుకొని తిరిగి కాజీపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నవాబుపేట వద్దకు రాగానే సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇమ్రాన్, డ్రైవర్ సుభాని అక్కడికక్కడే చనిపోగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న లింగాల ఘనపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని జనగామ జిల్లా హాస్పిటల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
మిర్యాలగూడలో రెండు బైక్‌లు ఢీకొని...
మిర్యాలగూడ, వెలుగు : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ముదిమాణిక్యం గ్రామ సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన ఈడుదుల రాంబాబు అనే వ్యక్తి బైక్‌పై అడవి దేవులపల్లికి వచ్చి తిరిగి వెళ్లే సమయంలో తనకు పరిచయం ఉన్న బొమ్మకంటి నర్యయ్య (45)ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తున్నాడు.
ఇదే సమయంలో పగిళ్ల సైదులు (54) అనే వ్యక్తి టీవీఎస్‌పై అడవిదేవులపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సైదులు అక్కడికక్కడే చనిపోగా, నర్సయ్య, రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా... ట్రీట్‌మెంట్ తీసుకుంటూ నర్సయ్య చనిపోయాడు.
డీసీఎం ఢీకొని మేకల కాపరి, 17 మేకలు మృతి
లింగంపేట, వెలుగు : డీసీఎం ఢీకొని కాపరితో పాటు 17 మేకలు చనిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన ఆలకుంట శివయ్య (60) శుక్రవారం ఉదయం తన మేకలను తోలుకొని అడవికి వెళ్తున్నాడు. ఈ సమయంలో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం శివయ్యతో పాటు మేకలను ఢీకొట్టింది. ప్రమాదంలో 17 మేకలు చనిపోగా శివయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు శివయ్యను 108లో ఎల్లారెడ్డి హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ చనిపోయాడు.
