
- బతుకమ్మ కుంటలో కొనసాగుతున్న నిర్మాణాలు
- జిల్లా కేంద్రం ఎంట్రన్స్‌ల వద్ద జంక్షన్ల అభివృద్ధి
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రానికి నయా లుక్ తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రం రూపు మార్చేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయిస్తున్నారు. రూ.కోటీ 80 లక్షల పై నిధులతో నిర్వహిస్తున్న డెవలప్మెంట్ పనులు పూర్తైతే జిల్లా కేంద్రం సరికొత్త అందాలను సంతరించుకోనుంది.
బతుకమ్మకుంటకు మహర్దశ..
జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత జనాభా పెరుగుతూ లక్షకు చేరింది. వేలాది మంది వివిధ పనుల నిమిత్తం వస్తుతుంటారు. ప్రజల కోసం జనగామలో ఒక్క పార్కు కూడా లేదు. దీంతో బతుకమ్మకుంటను గత ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించి, కొన్ని పనులను చేపట్టి వదిలేశారు. పట్టణ ప్రజల భాగస్వామ్యంతో డెవలప్ చేయాలని భావించినా అది కూడా ముందుకు సాగలేదు. ఈ బతుకమ్మ కుంటలోనే సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ.
దీంతో పార్కు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనగామకు ల్యాండ్‌మార్క్‌గా ఉన్న బతుకమ్మ కుంట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ.కోటిన్నర నిధులతో గత వేసవి నుంచి డెవలప్మెంట్పనులు చేపడుతున్నారు. వాకింగ్ట్రాక్డెవలప్తోపాటు కుంటను ఆనుకుని ప్రత్యేక గ్రిల్స్, టైల్స్, చైర్స్, లైటింగ్పనులు చేపడుతున్నారు. ఓపెన్ జిమ్ఏరియాలో పార్క్పనులు కొనసాగుతున్నాయి. కుంట పూడికతీత పూర్తైంది. వాకింగ్ట్రాక్చుట్టూ ప్రత్యేక లైటింగ్పనులు చేస్తున్నారు. పనులన్నీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జంక్షన్ల అభివృద్ధి..
జనగామ ఎంట్రన్స్‌ల వద్ద కొత్త అందాలు సంతరించేందుకు జంక్షన్లు డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ – వరంగల్ హైవే పై జనగామలోకి వచ్చే పెంబర్తి, యశ్వంతాపూర్ జంక్షన్ల వద్ద ఆకర్షణీయ స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. హైవే పై వెళ్లే వారికి కలర్ఫుల్గా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్‌తో పనులు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక లుక్ వచ్చేలా మొక్కలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. రూ.30 లక్షలతో చేపడుతున్న ఈ తోరణాల వద్ద జనగామ వెల్కమ్బోర్డులతోపాటు ప్రభుత్వ సింబల్ కనిపించేలా పనులు చేస్తున్నారు. రాత్రి వేళల్లో లైట్ల వెలుగుల్లో మరింత ఆకట్టుకునేలా కనిపించనున్నాయి.