
- నేడు హౌసింగ్ కార్పొరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవం)
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 1979 జులై 5న రాష్ర్ట గృహ నిర్మాణ సంస్ధను ఏర్పాటు చేసింది. ఇయ్యాల 46 ఏండ్లు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. గతంలో హౌసింగ్ కార్పొరేషన్ సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగింది.
అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేద ప్రజల పెన్నిధిగా పేరుగాంచిన ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ , హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దానం కలిసి ఇండ్ల నిర్మాణ విధివిధానాలు కాంట్రాక్టర్ల వ్యవస్థ లేకుండా లబ్ధిదారులు తమ ఇళ్ళను తామే నిర్మించుకునే విధంగా సెల్ఫ్ హెల్ప్ మ్యూచువల్ హెల్ప్ అనే ప్రాతిపదిక మీద నిర్మాణాన్ని చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చారు.
మధ్యవర్తి ప్రమేయం లేని ఇటువంటి పద్ధతి దేశవ్యాప్తంగా ఆదర్శదాయకంగా మారి మన గృహ నిర్మాణ పథకానికి యావత్ దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. 2013– 14 నాటికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో కోటి గృహాలను నిర్మించి జాతీయ, అంతర్జాతీయ రికార్డులను అధిగమించింది.
తెలంగాణ ఏర్పాటు తరువాత నిర్లక్ష్యం
తెలంగాణ ఏర్పాటు తరువాత హౌసింగ్ కార్పొరేషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారు. ఈ కార్పొరేషన్లో ఉన్న ఇంజినీర్లను అందరిని ఇతర శాఖల్లో డిప్యూటేషన్ పద్ధతిలో పంపి కార్పొరేషన్‌ను నిర్లక్ష్యం చేశారు. అంతేకాకుండా ఎంతో ఘన చరిత్ర ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ను రోడ్లు భవనాల శాఖలో విలీనం చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కాకుండా కాంట్రాక్టర్లకు అప్పగించారు. నా మానస పుత్రిక అని డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను చెప్పుకున్న మాజీ సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో 2 లక్షల 70 వేల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేసి కేవలం 65 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు.
ఎన్నికలకు ముందు డబుల్ ఇళ్లు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో నిర్మాణం పూర్తి అయినా 2, 3 ఏళ్లు ఇళ్లను అలాగే ఉంచటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారి శిథిలావస్ధకు చేరుకున్నాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లు అని
40 వేలలోపు మాత్రమే నిర్మించారు.
మౌలిక సదుపాయాల కొరత
డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌లో యూనిట్ కాస్ట్ ప్రకారం ఒక గృహ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,04,000, పట్టణ ప్రాంతాల్లో రూ.5,30,000, జీహెచ్ఎంసీలో అయితే రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల 65 వేల రూపాయల వరకు ధరలు నిర్ణయించి కాంట్రాక్ట్ పద్ధతిన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ పథకం జీహెచ్ఎంసీ పరిధిలో కొంతమేరకు విజయవంతమైనప్పటికీ, జిల్లాలో మాత్రం లోపభూయిష్టంగా మారింది.
చివరకు 8ఏళ్లలో కేవలం 65వేల ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన 93,000 ఇళ్లకు సరియైన మౌలిక సదుపాయాలు లేక సగం కంటే ఎక్కువ ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల్లో అయితే ఇప్పటికి సుమారు 70,000 ఇండ్లు నిర్మాణ దశల్లో ఆగిపోయి మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చుచేసినప్పటికీ లబ్ధిదారులకు, ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ప్రజా ప్రభుత్వంలో జవసత్వాలు
కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని పున: ప్రారంభించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో చేపట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ఇంటికి ఒక్కంటికి రూ. 6,00,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది.
కేసీఆర్ హయాంలో వేరే డిపార్ట్మెంట్లకు పంపించిన ఇంజినీర్లను, అధికారులను తిరిగి కార్పొరేషన్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ అండ్ బీలో ఉన్న హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను తిరిగి సపరేట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
- జి. శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్