
- సెల్ఫీ తీసుకున్న రెండు నిమిషాల్లోనే ఘటన
- అయోధ్య యాత్రలో విషాదం
- ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిలో నలుగురు సేఫ్
జనగామ, వెలుగు: జనగామ జిల్లా వాసుల అయోధ్య యాత్రలో విషాదం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన తాళ్లపెల్లి తేజశ్రీ (17) సరయూ నదిలో సోమవారం ఉదయం గల్లంతైంది. అప్పటి వరకు నీళ్లల్లో ఆడిపాడిన బిడ్డ తమ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జనగామకు చెందిన ఓం సాయి ఫంక్షన్ హాల్ యజమాని తాళ్లపెల్లి నాగరాజు తన భార్య జయసుధ, ఇద్దరు బిడ్డలు తేజశ్రీ, తరుణి, మరో రెండు కుటుంబాలు కలిసి మొత్తం 12 మంది ఈనెల 27న రాత్రి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య యాత్రకు వెళ్లారు. 28న హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
అదే రోజు రాముడిని దర్శంచుకున్నారు. సోమవారం ఉదయం సరయూ నదికి వెళ్లి లక్ష్మణ్ ఖిలా ఘాట్ వద్ద గడిపారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాగరాజు పెద్దబిడ్డ తేజశ్రీ, మరో నలుగురు యువతులు నదిలోకి దిగారు. కొద్దిసేపు నీళ్లలో ఆనందంగా గడిపారు. అదే సమయంలో నది ఎగువన ఉన్న నేపాల్ డ్యాం నుంచి నీటిని వదలడంతో ఒక్కసారిగా వరద పెరిగింది. ఐదుగురు యువతులు నదిలోకి జారిపోగా బంధువులు పెద్దఎత్తున కేకలు వేశారు. దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీం నదిలోకి దూకి నలుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చింది. కానీ, తేజశ్రీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని, ఇంకా ఆచూకీ దొరకలేదని బాలిక తండ్రి నాగరాజు విలపిస్తూ తెలిపాడు.
బండి సంజయ్ ఫోన్
తేజశ్రీ గల్లంతు విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. అయోధ్య ఎస్పీ రాజ్కరణ్ నాయర్, కలెక్టర్ చంద్రవిజయ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. తన కార్యాలయం నుంచి యూపీ ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ పంపించారు. అయితే, వరద ప్రవాహం పెరగడంతో ఫలితం కనిపించడం లేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనగామలోని యువతి బంధువుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.